షూటింగ్ అప్ డేట్స్ కంటే ఊహాగానాలు, అనుమానాలతోనే ఎక్కువగా పాపులరైంది మట్కా. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా, ఆ ఊహాగానాలకు మరింత ఊతమిస్తూ, ఎప్పటికప్పుడు ఆగిపోతోంది. పడుతూలేస్తూ సాగుతోంది. ఈమధ్య కొన్నాళ్లుగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది.
వరుణ్ తేజ్, మట్కా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈనెల 19వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నాడు. దీని కోసం రామోజీ ఫిలింసిటీలో సెట్ వేస్తున్నారు. ఈసారి గ్యాప్స్ ఉండవని, అనుమానాలు అక్కర్లేదని చెబుతున్నారు యూనిట్ లో కొంతమంది జనాలు.
పలాస్ సినిమా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది మట్కా. ఈ సినిమా కోసం ఏరికోరి మరీ బాలీవుడ్ భామ నోరా ఫతేహిని తీసుకున్నారు. అది ఎందుకో సినిమా చూస్తే అర్థమౌతుందని చెబుతున్నారు. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది.
పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. అటుఇటుగా 24 ఏళ్ల స్పాన్ ఉన్న కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందుకే 4 గెటప్స్. రామ్ తళ్లూరి, విజయేందర్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తారట. ఆపరేషన్ వాలంటైన్ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న సినిమా ఇదే.