చిత్రం: మనమే
రేటింగ్: 2/5
తారాగణం: శర్వానంద్, కృతి శెట్టి, విక్రం ఆదిత్య, త్రిగుణ్, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్, సచిన్ ఖేదేకర్, తులసి, సీత, ముకేష్ రిషి తదితరులు
సంగీతం: హేషం అబ్దుల్ వాహబ్
కెమెరా: జ్ఞాన ప్రకాష్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
నిర్మాత: విశ్వ ప్రసాద్
దర్శకత్వం: సాయిరాం ఆదిత్య
విడుదల: జూన్ 7, 2024
ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే నటుడు శర్వానంద్ హీరోగా పీపుల్స్ మీడియా వారి చిత్రం. అప్పట్లో భలే మంచి రోజు తీసిన సాయిరాం ఆదిత్య దర్శకుడు. ఇదొక హాలీవుడ్ చిత్రానికి రీమేక్. విషయమేంటో చూద్దాం.
విక్రమ్(శర్వానంద్), సుభద్ర (కృతి శెట్టి) అనుకోని పరిస్తితుల్లో కుషి (విక్రమ్ ఆదిత్య) అనే పిల్లాడిని పెంచాల్సి వస్తుంది. యాక్సిడెంటులో చనిపోయిన ఆ పిల్లడి తల్లిదండ్రులు అనురాగ్ (త్రిగుణ్), శాంతి. ఆ అనురాగ్ స్నేహితుడు విక్రమ్, శాంతి స్నేహితురాలు సుభద్ర. అదీ నేపథ్యం.
అలా పిల్లాడిని పెంచే క్రమంలో భిన్న ధృవాలైన విక్రమ్, సుభద్రలు ఎలా దగ్గరయ్యారనేది కథనం. మధ్యలో వచ్చే పాత్రలు, పోయే పాత్రలు ఉండనే ఉంటాయి. కథాంశం చెప్పుకోవాలంటే ఇంతే.
ప్లాట్ పాయింట్ బాగుందని, హాలీవుడ్‌లో తీయబడిందని, అలా తీసేస్తే మనవాళ్లకి సరిపోతుందని దిగిపోయి పెద్దగా మెదడుకి శ్రమ పెట్టకుండా తీసేసారేమో.
రాకరాక వచ్చిన అవకాశంతో తబ్బిబ్బయి ఏదో ఒకటి చెయ్యాలని చేసినట్టుంది తప్ప కథని, కథనాన్ని నేటివిటీకి తగిన భావోద్వేగాలతో చెక్కే పని అస్సలు పెట్టుకోలేదు. సీన్ వెంట సీన్ పేర్చుకుంటూ పోయినట్టుంది తప్ప అసలు ఎమోషన్ ఫ్లో మీద దృష్టి పెట్టినట్టే లేదు.
ప్రధమార్ధంలో మొదటి 20 నిమిషాలు కాస్తంత ఆసక్తి కలిగిస్తుంది. పెళ్లి కాని ఒక అమ్మాయి, అబ్బాయి ఒక అనాధ పిల్లాడిని పెంచడమనే డ్రామా బానే ఉందనిపిస్తుంది. కానీ రాను రాను ఆ ఆసక్తిని పెంచాల్సింది పోయి విసిగిస్తూ సాగుతుంది. “లైఫ్ యాజ్ వుయ్ నో ఇట్” అనే హాలీవుడ్ చిత్రాన్ని చూసి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమిది.
ప్రేక్షకులకి ఆ పిల్లాడితో ఎమోషనల్ జర్నీ ఏమీ ఉండదు.
హీరో బాధ్యతారాహిత్యమైన జీవితం హీరోయిన్ కే కాదు ప్రేక్షకులకి కూడా చిరాకుగా అనిపిస్తుంది.
హీరోయిన్ మాట మీద నిలబడడమనే ఆదర్శవాదం హీరోకే కాదు ప్రేక్షకులకి కూడా కాస్తంత బరువుగానే అనిపిస్తుంది.
విలన్ బాధ అర్ధమయ్యీ అర్ధమవ్వనట్టు ఉంటుంది.
హీరోయిన్ ఫియన్సీ మంచివాడే.. ఒక దశలో హీరోయిన్ హీరోని కాకుండా అతనితో సెటిలైపోతే బెస్ట్ అని ప్రేక్షకులకి అనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరో పాత్ర ప్రేక్షకులని టచ్ చెయలేదు. అలా చేయని చిత్రాలు నిలబడలేవు.
పోనీ సంగీతం పరంగా ఏమైనా అద్భుతం జరిగిందా అంటే అస్సలు లేదు. విజయ్ దేవరకొండ “ఖుషి” సినిమాకి సంగీతమిచ్చిన దర్శకుడేనే ఈ చిత్రానికి సంగీతమిచ్చింది అని గిల్లుకుని చెక్ చేసుకోవాలనిపిస్తుంది. అసలు హాంటింగ్ ట్యూన్ కానీ, మేజికల్ లిరిక్స్ కానీ వినిపించనేలేదు. పైగా అడుగడుక్కి వచ్చే పాటలు సినిమా లెంగ్త్ ని పెంచడానికి తప్ప దేనికీ పని చేయలేదు.
పూర్వం ఇలాంటి పాటలొచ్చినప్పుడు బయటికెళ్లి సిగిరెట్లు కాల్చుకునేవాళ్లు. ఇప్పుడు జనం బయటికెళ్లి మొబైల్ కాల్స్ చేసుకుని వస్తున్నారు. అంతే తేడా.
కథనం ఎలా ఉన్నా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంటే ఒక్కోసారి బిలో యావరేజ్ కథనం కూడా యావరేజ్ రేంజుకి వెళ్తుంది. కనీసం ఆ యోగం కూడా లేకపోయింది ఈ సినిమాకి.
సినిమాని వినోదాత్మకంగా లైటర్ వీన్ లో తీస్తున్నట్టు ఫీలయ్యి తీసాడు గానీ, నిజానికి సహనపరీక్ష పెట్టిన చిత్రమిది. ముఖ్యంగా ద్వితీయార్ధమైతే ఎప్పుడెప్పుడయిపోతుందా అనే భావన కలిగింది.
నిర్మాణ విలువల్లో ఎక్కడా లోపం లేదు. లోకేషన్ కానీ, ఆర్టిస్టులు కానీ అన్నీ పర్ఫెక్ట్. కానీ అన్ని వనరులు ఇస్తే పండించిన ఎమోషన్ గానీ, ముద్రించిన భావోద్వేగం గానీ, పంచిన వినోదం గానీ మృగ్యం.
డైలాగ్స్ ఒకటి రెండు చోట్ల బానే ఉన్నా ఓవరాల్ గా చాలా వీన్ డైలాగ్ రైటింగ్ అని చెప్పాలి.
ఎలా చూసుకున్నా పీపుల్స్ మీడియా సంస్థ వరుసగా మిండ్ రేంజ్ మరియు పెద్ద చిత్రాలు నిర్మిస్తున్న బ్యానర్. వినూత్నమైన కథాంశాలు, వినోదం పాళ్లు ఎక్కువున్నవి నిర్మిస్తే స్ట్రైక్ రేట్ బాగుంటుంది. లేకపోతే ఇలాంటి మీడియోకర్ చిత్రాలతో బ్యానర్ వేల్యూ కూడా తగ్గుతుంది. కనుక ఆ దిశగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
ఒక క్లాస్ ఫ్యామిలీ వినోదాత్మక చిత్రాన్ని చూసే అవకాశముందని ట్రైలర్ని చూసి అనుకుంటే అందులో “క్లాస్” అనేదొక్కటే కరెక్ట్.
“ఫ్యామిలీ”, “వినోదం” అనేవి ఆశించిన స్థాయిలో లేవిందులో.
అన్నేసి పాత్రలున్నా ఏ పాత్ర ఎందుకుందో అర్ధం కాదు. జస్ట్ గ్యాపులు ఫిల్ చేయడానికి తప్ప మనసుని హత్తుకోవడానికి, డ్రామాని నడపడానికి ఉపయోగం లేని పాత్రలే ఎక్కువగా ఉన్నాయి.
బాలనటుడు విక్రం ఆదిత్య తన వయసుకి మించిన యాప్ట్ పర్ఫార్మెన్స్ చేసాడనే చెప్పాలి. ఆ క్రెడిట్ దర్శకుడికి కూడా చెందుతుంది.
శర్వానంద్ నటన ఈజీ గోయింగ్ స్టైల్లో బానే ఉంది. కానీ కథనపరంగా ఎమోషనల్ గా హత్తుకోదు.
కృతి శెట్టి ఓకే. డీసెంట్ గా తన పని తాను చేసుకుపోయింది.
వెన్నెల కిషోర్ ది గెస్ట్ కామెడీ. రాహుల్ రామకృష్ణ ఉన్నా లేనట్టే. ఒక్క నవ్వూ రాలేదు.
శర్వా సైడ్ కిక్ గా సుదర్శన్ కూడా అంతే. ప్యాడింగ్ మాదిరిగా ఉన్నాడు తప్ప కథనానికి పెద్ద ఉపయోగపడలేదు.
శివ కందుకూరి సెకండాఫుని కొత్త పుంతలు తొక్కిస్తాడేమో అని ఇంటర్వెల్లో ఎంటరైన తనని చూసి అనిపిస్తుంది. కానీ అలాంటి పనేం పెట్టుకోలేదు దర్శకుడు. ఎప్పుడో చాలా సినిమాల్లో చూసేసిన బీటెన్ ట్రాక్ కథనంలో కొట్టుకుపోయింది ఆ పాత్ర కూడా.
విలన్ గా రాహుల్ రవీంద్ర ఎంట్రీ బానే ఉన్నా క్లోజింగ్ పరమ వీక్ గా ఉంది.
ముకేష్ రిషి ఇంట్రో సీన్లో బెడ్ మీద పడుకుని కనిపిస్తాడు. మళ్లీ క్లైమాక్స్ లో రివాల్వర్ పట్టుకుని లేస్తాడు. అంతే!
సీనియర్ నటి సీత, తులసి, సచిన్ ఖేదేకర్ యాంబియన్స్ కోసం ఉన్నారంతే. సీరత్ కపూర్, అయేషా ఖాన్ లు కాస్తంత గ్లామర్ డోస్ కి పనిచేసారు.
ప్రారంభంలో కనిపించిన హీరో ఫ్రెండ్ అనురాగ్ (త్రిగుణ్) పాత్రతో కూడా ప్రేక్షకుడు ప్రయాణించలేని పరిస్థితి.
కథనంలో కమెర్షియల్ ఎలిమెంట్స్, భావోద్వేగాలు, మళ్లీ లైటర్ వీన్… ఇలా రకరకాలుగా బ్లెండ్ చేసే ప్రయత్నం జరిగింది. కానీ సత్ఫలితం ఇచ్చే విధంగా తయారుకాలేదు. భారీగా కనపడాలని పేరున్న ఆర్టిస్టులని పెట్టుకుని, చివరికి ఏ పాత్రనీ సరిగా మలచలేక తడబడ్డాడు దర్శకుడు. ఫైనల్ గా తాడు తెగిన గాలిపటంలా ఎక్కడో ల్యాండయింది చిత్రం. వర్షాకాల ఆరంభంలో విడుదలైన ఈ చిత్రం నిర్మాతకి కాసుల వర్షం కురిపించడం కష్టమే.
బాటం లైన్: హత్తుకుంది అనలేమే!