ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు దగ్గర ఇద్దరు భజంత్రీలు వుంటారు. పొగిడినప్పుడల్లా వాళ్లు డోలు వాయిస్తుంటారు. అంటే పొగడ్తలు తలకెక్కకుండా వాళ్లు హెచ్చరిస్తారు.
జగన్ దీనికి భిన్నంగా భజన బ్యాచ్‌తో తన్మయుడై వాళ్ల మాటలు, నివేదికలు, గణాంకాలు నమ్మి మునిగిపోయాడు. కోళ్ల గుంపులాంటి సలహాదారులను పెట్టుకుని వాస్తవాల్ని గుర్తించలేకపోయాడు. ఒక్క సలహాదారుడు కూడా పార్టీ గోదారిలో కలిసిపోతూ వుందని కనిపెట్టలేకపోయారు.
తిట్లు, శాపనార్థాలు, వల్గారిటీతో తెలుగుదేశాన్ని జయిస్తున్నామని అనుకున్నారు. కానీ జనం ఏవగించుకుంటున్నారని కనిపెట్టలేకపోయారు. పార్టీకి ఎవరు హానికరమో వాళ్లందరినీ అక్కున చేర్చుకున్నాడు. జగన్‌ని గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తల్ని విసిరికొట్టారు. సోషల్ మీడియాలో యుద్ధం చేసిన వాళ్లని కరివేపాకుల్లాగా తీసి పారేశారు.
సాక్షిలో రాతగాళ్లని కాకుండా, మోతగాళ్లకి పెద్దపీట వేశారు. విద్వత్తు ఉన్న వాళ్లని పక్కన పెట్టి డోలు విద్వాంసుల్ని చేరదీశారు. చేవని మరిచి చెక్క భజనని వీనుల విందుగా విన్నారు.
ఈ చిడతల బ్యాచ్ పార్టీకి పిడకలు కొట్టారు. పార్టీ కోసం, ప్రజల కోసం పని చేసే ఎమ్మెల్యేలకి కూడా జగన్ దర్శనం దక్కకుండా చేశారు. కార్యకర్తలుంటేనే ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు వుంటేనే ముఖ్యమంత్రి. ప్రజలుంటేనే వీళ్లంతా. ఈ అంచెల వారీ విధానాన్ని విస్మరించి తానే దేవుడనుకున్నాడు జగన్. చుట్టూ వున్న పూజారులు స్త్రోత్రాలు పాడి పార్టీని శాశ్వతంగా పవళింపు సేవకి పరిమితం చేశారు.
కాకారాయుళ్లైన ఎమ్మెల్యే, ఎంపీలను నమ్మి, పార్టీలోని కాకలుతీరిన యోధుల్ని కూడా దూరం పెట్టారు.
జనం సాయం కోరుతారు, భిక్షం కాదు. మేము డబ్బులిస్తున్నాం, మీరు ఓటు వేయండి అంటే అది లంచం లేదా భిక్షం. జనం తిరస్కరించారు. అందరూ కలిసి ఎపుడూ జనం మధ్యే వుండే జగన్‌ని, జనానికి దూరం చేశారు. పోరాడే కార్యకర్తల్ని దూరం చేసుకుని, పొగిడే పరాన్నభుక్కుల్ని దగ్గర చేసుకున్న ఫలితం ఘోర ఓటమి.
ఈ ఐదేళ్లలో జగన్ ఏమీ సాధించలేదా? అంటే సాధించాడు. మీడియా మొహం చూడని తొలి ముఖ్యమంత్రి, లక్షల కోట్ల అప్పు, బటన్ ద్వారా పంపిణీ, ఛీప్ లిక్కర్ తాగేవాళ్లందరికీ ప్రెసిడెంట్ మెడల్, బూతుల మంత్రులకి భుజకీర్తులు, ఇసుక మాఫియా, భజన చేసిన వాళ్లకి చేసినంత ప్రసాదం. ఇదంతా పాలన అని ఆయన అనుకున్నాడు. జనం అనుకోలేదు.