ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై విస్తృత చర్చ జరుగుతోంది. కూటమిలో మూడు పార్టీలుండడంతో ఏఏ పార్టీకి ఎన్నెన్ని మంత్రి పదవులు దక్కొచ్చో రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి చర్చలో వచ్చే ఏకైక పేరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు కూడా.
గతంలో ఈయన ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎపిసోడ్‌లో బుచ్చయ్య చౌదరి నిజాయితీ చాటుకున్నారు. ఎన్టీఆర్ వెంట నడిచారు. ఎన్టీఆర్‌ను కూలదోయడంలో అల్లుడైన చంద్రబాబునాయుడు దుర్మార్గంగా వ్యవహరించారని, తీవ్రస్థాయిలో బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. బాబుపై కేసుల వరకూ కూడా వెళ్లినట్టు చెబుతుంటారు.
అయితే ఎన్టీఆర్ మరణానంతరం తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు వెంట బుచ్చయ్య చౌదరి నడిచారు. అయినప్పటికీ తనపై బుచ్చయ్య తనపై అవాకులు చెవాకులు పేలడంతో పదవులు ఇవ్వకుండా దూరంగా పెడుతూ వచ్చారు. బుచ్చయ్య చౌదరి పార్టీలో వుంటూనే అప్పుడప్పుడూ చంద్రబాబు, లోకేశ్‌లపై విమర్శలు చేస్తుంటారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినప్పుడు లోకేశ్‌పై బుచ్చయ్య ఘాటు విమర్శలు చేశారు. కనీసం తాను ఫోన్ చేసినా లోకేశ్ రిసీవ్ చేసుకోవడం లేదంటూ మండిపడ్డారు.
ఆ తర్వాత చల్లబడ్డారు. టీడీపీ సీనియర్ నేతల బుజ్జగింపుతో పార్టీలోనే ఆయన కొనసాగారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్‌లో బుచ్చయ్య చౌదరికి చోటు దక్కుతుందా? లేదా? అనే విషయమై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బుచ్చయ్యకు వయసు కూడా పైబడడంతో, ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ అమాత్య పదవికి నోచుకోరనే మాట వినిపిస్తోంది. బుచ్చయ్య కూడా రాజకీయ చరమాంకంలో ఉన్న తనకు చివరిగా మంత్రి పదవి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు. చంద్రబాబునాయుడు కరుణిస్తారా? లేక పాత దూషణలు మనసులో పెట్టుకుని, మరోసారి మొండిచెయ్యి చూపుతారా? అనేది తేలాల్సి వుంది.