వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు తాజా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదరాజులరెడ్డి చేతిలో ఓడిపోయిందుకు తనకు బాధ లేదన్నారు. దానికి కారణం.. తనకు గురువు, అత్యంత బలవంతుడు, రాజకీయంలో అత్యంత శక్తిమంతుడని గతంలో చెప్పానని ఆయన గుర్తు చేశారు.
ప్రజలు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వరదరాజులరెడ్డి గెలిచారని ఆయన అన్నారు. ఒకసారి గురువుపై తాను గెలుపొందానని, ఇప్పుడు తనపై ఆయన విజయం సాధించారన్నారు. గురువైన వరదరాజులరెడ్డిపై గెలిచినా, ఓడినా తనకు గౌరవమే అని రాచమల్లు తెలిపారు.
బలమైన బాధ్యతల్ని ప్రజలు ఇచ్చారని వరదరాజులరెడ్డికి గుర్తు చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతల్ని అప్పగించారని ఆయన తెలిపారు. గడిచిన 25 ఏళ్లలో ప్రజాప్రతినిధిగా ఏం చేశారో విమర్శించడం, పొగడడం ఇప్పుడు అప్రస్తుతమన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో అప్పగించిన బాధ్యతల్ని స్వీకరించాలని ఆయన కోరారు. రాజకీయ జీవిత చరమాంకంలో ఐదేళ్ల బాధ్యతల్ని సద్వినియోగం చేసుకోవాలని వరదరాజులరెడ్డికి ఆయన సూచించారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు రాచమల్లు తెలిపారు.
ఐదేళ్లలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి ఏడాది పాటు ఎలాంటి విమర్శలు చేయనని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే ప్రశ్నించనన్నారు. పాలన గాడిలో పడడానికి ఏడాది సమయం తీసుకుంటుందన్నారు. ఏడాది నాటికి హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం వెనకంజు వేస్తే, ప్రశ్నించడానికి తాము ముందడుగు వేస్తామని ఆయన హెచ్చరించారు.