ప్రధాని నరేంద్రమోడీ కనీసం ఈసారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కూసింత ప్రేమను చూపిస్తారా? తాను సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడపడానికి ఆంధ్రప్రదేశ్ ద్వారా అందిన కంట్రిబ్యూషన్ కీలకమైనదనే వాస్తవాన్ని ఆయన గుర్తిస్తారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ కూటమిని గెలిపించిన తీరు వల్ల మాత్రమే.. కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం తన సారథ్యంలో ‘నిశ్చింతగా’ ఏర్పడే పరిస్తితి వచ్చిందని ఆయన గ్రహించారా? అందుకు ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడడం ద్వారా తాను రుణం చెల్లించుకోవాలనే భావన ఆయనలో మొదలవుతుందా? అనే తరహా చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తర్వాత.. అతిపెద్ద పార్టీ తెలుగుదేశమే అనే సంగతి అందరికీ తెలుసు. నిజానికి ఇలాటి పరిస్థితి మరో పార్టీకి ఉంటే గనుక.. ఆ ఎడ్వాంటేజీని తమ రాష్ట్ర పురోగతికి వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. తెలుగుదేశం తర్వాతి స్థానంలో ఉన్న జేడీయూ బీహార్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అడుగుతన్న సంగతి కూడా మనం గమనిస్తున్నాం. అదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ అంత ధైర్యంగా అడగదు అనేది ఖరారే.
కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తమ పార్టీకి ఉన్న ఎడ్వాంటేజీని చంద్రబాబునాయుడు మంత్రి పదవులు పుచ్చుకోవడానికి, ఆ రూపేణా దోచుకోవడానికి వాడుకుంటారే తప్ప.. రాష్ట్రం కోసం ఆ బలాన్ని ఉపయోగిస్తారనే నమ్మకం ఎవ్వరికీ లేదు. నిజంగా చంద్రబాబు అలా చేసేవారే అయితే గనుక.. ప్రత్యేకహోదా కోసం పట్టుపట్టి సాధించుకురావాలి. కానీ అది జరగదు.
కనీసం నరేంద్రమోడీ అయినా తమ కూటమికి విలువ ఇచ్చిన, తమ పార్టీ తరఫున కూడా నలుగురు ఎంపీలను గెలిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కనీస కృతజ్ఞతను నిరూపించుకుంటారా? అనే ఆలోచన ప్రజల్లో వస్తోంది. మోడీకి అలాంటి భావన ఉంటే గనుక.. ఏపీ అభివృద్ధికి అండగా నిలవాలి. ప్రత్యేకహోదా సంగతి ఆశించే పరిస్థితి లేదు.. కనీసం రాజధాని నిర్మాణం, ఇతర మౌలిక వసతులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ, పారిశ్రామికీకరణకు అనుకూలంగా పన్నుల సడలింపులు వంటివి ఏమైనా చేస్తారా అనేది వేచిచూడాలి.
ఇప్పుడు ఏపీలో దక్కిన ఆదరణను కాపాడుకోవాలంటే.. మళ్లీ మళ్లీ బిజెపిని ఏపీ ప్రజలు సమాదరించాలంటే.. ఏపీకి లెక్కకు మించి కేంద్రం ఈదఫా సాయం అందించాలి. గత పదేళ్లలో చేసినట్టుగానే ఏపీని వంచించడం, వాడుకుని వదిలేయడం తన శైలి అని మోడీ మరోసారి నిరూపించుకుంటే.. ఫలితం అనుభవించక తప్పదు.