తెలుగుదేశం పార్టీకి అధ్యక్ష బాధ్యతలను మోయడానికి కొత్త వ్యక్తి అవసరమని పార్టీ నాయకులు శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న సమయంలో, పార్టీకి నూతన అధ్యక్షుడిగా మరొక వ్యక్తిని ఎంపిక చేయాలని వాదన బలంగా వినిపిస్తోంది. వార్ధక్యం పైబడిన చంద్రబాబునాయుడు మీద అటు ప్రభుత్వ, ఇటు పార్టీ బాధ్యతలు పెట్టడం కరెక్టు కాదనే వాదన ఎక్కువవుతోంది.
చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉండబోతున్నారు. ఎన్డీయేలో భారతీయ జనతా పార్టీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా 16 మంది ఎంపీలతో తెలుగుదేశం ఉంది. కాబట్టి ఎన్డీఏ సర్కారు తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలోనూ చంద్రబాబు భాగస్వామ్యం కూడా తప్పకుండా ఉంటుంది.
ఇలాంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో భాగస్వామ్యం ఇప్పటికే చంద్రబాబు మీద రెండు బాధ్యతలు అవుతాయి. అదే సమయంలో ఆయన మీద పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా ఉంచి ఒత్తిడికి గురి చేయడం తగదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఇప్పటికే బుద్ధా వెంకన్న లాంటి నాయకుడు చంద్రబాబు అమరావతిలో ప్రమాణస్వీకారం చేసే ముహూర్తానికి, పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ను నియమించాలని ఒక డిమాండ్ వినిపించారు. చంద్రబాబునాయుడు తనకు అలవాటైన ఒక వ్యూహం ప్రకారం.. బుద్ధా ద్వారా ఇలా చెప్పించారని దానిమీద పార్టీలో స్పందన ఎలా ఉంటుందో గమనించి ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని భావించారని ఒక వాదన ఉంది! అయితే నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్న సంగతి ఖరారైంది. అతని చేతిలోనే పార్టీ పగ్గాలు పెట్టడం జోడు గుర్రాల సవారి అవుతుందనే అభిప్రాయం కూడా ఉంది.
మరొకవైపు తెలుగుదేశం పార్టీ సారధ్యాన్ని నందమూరి కుటుంబం చేతుల్లో పెట్టాలనే అభిప్రాయం దశాబ్దాలుగా పార్టీలో వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే కొత్తజవసత్వాలు పుంజుకుంటుందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్ణయం ఎటువైపు ఉంటుందో తెలియదు గానీ మొత్తానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చంద్రబాబు చేతి నుంచి చాలాకాలం తర్వాత మరొకరి చేతికి వెళ్లే అవకాశం ఉందని మాత్రం స్పష్టం అవుతుంది.