టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పదవి విషయమై స్పష్టత వచ్చింది. బాబు కేబినెట్‌లో ఆయనకు బెర్త్ ఖరారైంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాత్రపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో రానున్న రోజుల్లో పవన్ ఎలాంటి వైఖరి తీసుకుంటారనే చర్చకు తెరలేచింది. ప్రభుత్వంలో భాగస్వామిగా వుంటారనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఏ పదవిని ఆయనకు ఇస్తారనే చర్చకు తెరలేచింది.
తమ నాయకుడికి దక్కే కీలక పదవిపై జనసేన నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకుంది. పవన్ పదవిపై జనసేన నాయకులు సహజంగానే చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగా ఆయనకు పదవి వస్తుందా? లేదా? అని జనసేన శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా లోకేశ్ కంటే ప్రాధాన్యం ఇస్తారని జనసేన నమ్ముతోంది.
మంత్రి వర్గంలో చేరనని, పార్టీ పనులు చూసుకుంటానని లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి వర్గంలో చేరకుండా, కీలక విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావడానికి వీలు కాదనే ఉద్దేశంతో లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకోడానికే చంద్రబాబు ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. దీంతో లోకేశ్ పదవిపై స్పష్టత వచ్చినట్టైంది.
గతంలో లోకేశ్‌ను కేబినెట్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రిగా లోకేశ్ పని చేశారు. ఇప్పుడు కూడా ఐటీ శాఖను ఆయనకే ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది.