తెలుగుదేశం గెలిచింది.. కెలుకుడు మొదలైంది

అధికార మార్పిడి జరిగిన వెంటనే కక్షసాధింపు చర్యలుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచింది, ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదు. కానీ రాజకీయ దాడులు మాత్రం పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ఇప్పుడీ ‘కెలుకుడు’ కార్యక్రమం…

అధికార మార్పిడి జరిగిన వెంటనే కక్షసాధింపు చర్యలుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచింది, ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదు. కానీ రాజకీయ దాడులు మాత్రం పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ఇప్పుడీ ‘కెలుకుడు’ కార్యక్రమం మీడియాకు కూడా విస్తరించింది.

రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే కొన్ని టీవీ ఛానెళ్లకు చుక్కలు చూపించడం ఖాయమని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడా కార్యక్రమం మొదలైంది. ఏపీలో చాలా ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్లు సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారు.

గెలిచిన రోజే లోకేష్ మాటలతో ఈ విషయం స్పష్టమైంది. గెలిచిన రోజు మీడియాతో మాట్లాడిన లోకేష్, “సాక్షి రాలేదా” అని ఇతర జర్నలిస్టుల్ని అడిగారు. నిజంగానే సాక్షి అది కవర్ చేయలేదు. ఆ వెంటనే మిగతా మైకుల వైపు చూసిన లోకేష్.. “ఎన్టీవీ, టీవీ9 ఉన్నాయిగా, అవి మరో సాక్షి” అంటూ వ్యాఖ్యానించారు.

‘నేను గుర్తుపెట్టుకుంటా’ అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. ఆ వెంటనే కేబుల్ ప్రసారాల్లో అంతరాయం కనిపించింది. అయితే ఎన్టీవీని పక్కనపెడితే, సాక్షి, టీవీ9కు ఇలాంటి చర్యలు కొత్తకావు.

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాక్షి మీడియాను అణచివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. ఆన్ రికార్డ్ సాక్షిపై తన ద్వేషాన్ని వెళ్లగక్కారు. ఇక టీవీ9పై గతంలో కేసీఆర్ సర్కారు వ్యవహరించిన తీరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రసారాలు కట్ చేశారు. టీవీ9 ఉద్యోగులు రోడ్లపైకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపిన సందర్భాలున్నాయి. అలా టీవీ9 చేతులు మారడానికి ఆద్యుడు గా మారారు కేసీఆర్.

అయితే అప్పటికి, ఇప్పటికి రోజులు మారాయి. ఈసారి మీడియాపై చర్యలు పెద్దగా ఫలితం చూపించే అవకాశం లేదు. ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్ల పెత్తనం తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లో డీటీహెచ్ సేవల వినియోగం పెరిగింది. సన్ డైరక్ట్, ఎయిర్ టెల్, టాటా స్కై లాంటి సర్వీస్ ప్రొవైడర్లను ఎంచుకున్నారు చాలామంది. ఈ ప్రసారాన్ని ఆపడం ఎవ్వరితరం కాదు. దీనికి తోడు యూట్యూబ్ ఉండనే ఉంది. ప్రతి న్యూస్ ఛానెల్ యూట్యూబ్ లైవ్ ఇస్తోంది. లోకేష్ ఇంకేదైనా కొత్తగా ఆలోచిస్తే మంచిదేమో.