ఇప్పుడు బయటపడుతుంది ‘అసలు రంగు’..!

మొన్నటివరకు ఐపీఎల్ ఓ ఊపు ఊపింది. అదే టైమ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరిగింది. ఈ రెండు అంశాలు ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా యూత్ ను సినిమాలకు దూరం చేశాయి.…

మొన్నటివరకు ఐపీఎల్ ఓ ఊపు ఊపింది. అదే టైమ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరిగింది. ఈ రెండు అంశాలు ప్రేక్షకుల్ని, మరీ ముఖ్యంగా యూత్ ను సినిమాలకు దూరం చేశాయి. థియేటర్లన్నీ బోసిపోయాయి, ఆక్యుపెన్సీ అట్టడుక్కి చేరింది. కొన్నాళ్ల పాటు థియేటర్లు మూసేయాలని కూడా నిర్ణయించారు కొంతమంది ఎగ్జిబిటర్లు.

ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తమ సినిమా ఫెయిల్ అవ్వడానికి ఐపీఎల్, ఎన్నికలే కారణమంటూ కొంతమంది మేకర్స్ చెప్పుకున్నారు. ఇప్పుడా సందడి ముగిసింది. మరి సినిమా థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందా..?

థియేటర్లకు జనం రావడం తగ్గించేశారు. ఓటీటీ విజృంభన కావొచ్చు, టికెట్ రేట్లు కావొచ్చు, సినిమాపై హైప్ లేకపోవడం కావొచ్చు.. ఇలా కారణం ఏదైనా తుదిప్రభావం థియేటర్లపై పడుతోంది. ఇప్పటికే  చాలా థియేటర్లు మూతపడ్డాయి. కల్యాణ మంటపాలుగా, గోడౌన్లుగా మారిపోయాయి. ఐపీఎల్, ఎన్నికలు థియేట్రికల్ సిస్టమ్ ను మరింత దెబ్బతీశాయి. ఇప్పుడన్నీ సద్దుమణగడంతో తిరిగి థియేటర్లు కళకళలాడతాయా అనేది ప్రధానమైన ప్రశ్న.

హడావుడి అంతా ముగిసిన తర్వాత తొలి విడతగా రేపు శుక్రవారం 4 సినిమాలొస్తున్నాయి. వీటిలో శర్వానంద్ నటించిన ‘మనమే’ సినిమా ప్రచారంతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత కాజల్ నటించిన సత్యభామ సినిమా ఆకట్టుకుంటోంది. జనాలు థియేటర్లకు ఏ మేరకు వస్తారనే విషయాన్ని ఈ రెండు సినిమాలు మనకు చూపించబోతున్నాయి.

ఒకవేళ వీటిపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోతే మాత్రం నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే. 27న కల్కి సినిమా వస్తోంది. ఆ సినిమాతో థియేట్రికల్ సిస్టమ్ పై అందరికీ ఓ అవగాహన వస్తుంది. సాధారణ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గించేశారు. పండగలు వచ్చినప్పుడు, పెద్ద సినిమాలు రిలీజైనప్పుడు మాత్రమే సినిమా హాళ్ల మొహం చూస్తున్నారు. ఏపీలో థియేటర్ల అసలు రంగు ఈ నెలలో బయటపడుతుంది.