పుష్ప టీమ్ ఈ తప్పులు సరిదిద్దుకుంటుందా?

పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది. కానీ రిలీజైన మొదటి రోజు ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా…

పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది. కానీ రిలీజైన మొదటి రోజు ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై విమర్శలు చెలరేగాయి. పార్ట్-2 రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ, ఈ అంశాన్ని లెక్కలోకి తీసుకున్నారా లేదా?

పుష్ప సినిమాలో గ్రాఫిక్స్ పేలవంగా ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. నీళ్లలో ఎర్ర చందనం దుంగలు తేలుతున్నప్పుడు, అడవిలో ఎర్ర చందనం చెట్లు చూపించినప్పుడు హై-ఎండ్ గ్రాఫిక్స్ వాడలేదు. బిగ్ స్క్రీన్ పై చూసినప్పుడు ఆ లోపాలు స్పష్టంగా కనిపించాయి.

అంతేకాదు, రిలీజైన మొదటి 2-3 రోజులు సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా విమర్శలు చెలరేగాయి. మంగళం శీనుకు తనదైన స్టయిల్ లో పుష్పరాజ్ వార్నింగ్ ఇచ్చినప్పుడు, జాలి రెడ్డితో తలపడినప్పుడు, క్లైయిమాక్స్ లో షెకావత్ కు కౌంటర్ ఇచ్చి పెళ్లి మంటపానికి వెళ్లినప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదంటూ విమర్శలు వచ్చాయి. మరి టీమ్ ఈ ఫీడ్ బ్యాక్ ను లెక్కలోకి తీసుకుందా..?

ప్రచారం సంగతేంటి..?

పుష్ప ప్రచారం విషయంలో కూడా ప్లానింగ్ లోపం కనిపించింది. రిలీజ్ కు ముందురోజు వరకు సుకుమార్, ప్రచారానికి అందుబాటులోకి రాలేదు. ఆఖరి నిమిషం వరకు చెక్కుతూనే ఉన్నాడు. అలా పుష్ప విషయంలో పాన్ ఇండియా ప్రచారం పూర్తిస్థాయిలో జరగలేదు.

కానీ పుష్ప-2 ప్రచారం మాత్రం పక్కాగా జరగాలి. అంచనాలు భారీగా ఉన్నాయి, బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. వీటన్నింటినీ అందుకోవాలంటే పక్కాగా ప్రమోట్ చేయాలి. ఆఖరి నిమిషం వరకు పనులు పెట్టుకుంటే కుదరదు.

పుష్ప పాన్ ఇండియా లెవెల్లో హిట్టయిన తర్వాత పుష్ప-2 కథ-స్క్రీన్ ప్లేలో భారీ మార్పుచేర్పులు చేశారు. అవే మార్పులు పైన చెప్పుకున్న అంశాల్లో కూడా జరగాలి. అప్పుడే మూవీ పెర్ ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది.