మాట కాదు… చేత‌ల్లో చూపు జ‌గ‌న్‌!

అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి… ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆస్తులు, ఇత‌ర‌త్రా వాటిపై య‌థేచ్ఛ‌గా దాడులు జ‌రుగుతుండ‌డంపై ఆందోళ‌న నెల‌కుంది. వైసీపీ సోష‌ల్ మీడియా మండ‌ల క‌న్వీన‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడంటే, వేధింపులు…

అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి… ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆస్తులు, ఇత‌ర‌త్రా వాటిపై య‌థేచ్ఛ‌గా దాడులు జ‌రుగుతుండ‌డంపై ఆందోళ‌న నెల‌కుంది. వైసీపీ సోష‌ల్ మీడియా మండ‌ల క‌న్వీన‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడంటే, వేధింపులు ఏ స్థాయిలో మొద‌ల‌య్యాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. కేడ‌ర్‌కు భ‌రోసా ఇచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నించారు. ఆ పోస్టు ఏంటంటే…

“రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టీడీపీ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ  గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్‌  వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం”

టీడీపీ దాడుల‌పై జ‌గ‌న్ స్పందించ‌డం అభినంద‌నీయం. అయితే సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్ట‌డంతో వైసీపీ శ్రేణుల్లో భ‌రోసా రాదు. బాధిత వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్ని నేరుగా ఆయ‌న ప‌రామ‌ర్శించాల్సిన స‌మ‌యం ఇదే. అప్పుడే పార్టీ కోసం గ‌ట్టిగా నిల‌బ‌డుతారు. లేదంటే భ‌యాందోళ‌న‌ల‌కు గురై, స్వ‌స్థ‌లాల‌ను వ‌దిలి , ఇత‌ర ప్రాంతాల‌కు ర‌క్ష‌ణ నిమిత్తం వ‌ల‌స వెళ్లాల్సి వుంటుంది. అందుకే టీడీపీ దాడుల కార‌ణంగా న‌ష్ట‌పోయిన కార్య‌క‌ర్త‌కు, సోష‌ల్ మీడియా సైనికుల‌కు తోడుగా వుంటామ‌నే మాట‌తో స‌రిపెట్టొద్దు. నేరుగా బాధితుల ఇళ్ల‌కు వెళితే, అప్పుడు వారికి త‌మ కోసం నాయ‌కుడున్నాడ‌నే ధైర్యం వ‌స్తుంది.