ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఓడిపోయిన పార్టీల్లో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. కొందరు వైసీపీ నేతలు తమ పార్టీ ఘోర పరాజయానికి దారి తీసిన పరిస్థితులపై నిర్మొహమాటంగా మాట్లాడారు. భవిష్యత్‌లో మరింత మంది అదే బాటలో పయనించే అవకాశం వుంది.
తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై సొంత పార్టీ నేతల నుంచి ఘాటు విమర్శలు రావడం చర్చనీయాంశమైంది. షర్మిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు నినాదాలు చేశారు. షర్మిల ఒంటెత్తు పోకడలతో వ్యవహరించారని విమర్శించారు. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలపై విమర్శలు చేయలేదన్నారు.
కేవలం తన వ్యక్తిగత కక్ష తీర్చుకోవడం కోసమే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రాజకీయం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల ఫండ్‌ను అభ్యర్థులెవరికీ ఇవ్వకుండా, షర్మిల దాచుకున్నారని పద్మశ్రీ ఆరోపించడం గమనార్హం. అభ్యర్థుల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆమె గాలికి వదిలేశారని సుంకర పద్మశ్రీ మండిపడ్డారు.
ఓటమికి బాధ్యత వహించి ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి షర్మిల రాజీనామా చేయాలని సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు.