కూటమి ప్రభుత్వం కొలువుదీరకనే పరిపాలనాపరమైన నిర్ణయాలు వెల్లడవుతున్నాయి. ఎన్నికలకు ముందు ఏపీలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులను అమలు చేయొద్దని పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన డీఈవోలకు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ బదిలీల్లో అవినీతి జరిగిందనే అనుమానంతో బ్రేక్ వేసినట్టు సమాచారం.
ఎన్నికలకు ముందు ఏపీలో 1,800 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయి. బొత్స సత్యనారాయణ బాధ్యత వహించిన విద్యాశాఖలో సిఫార్సులు, ఫైరవీలకు భారీ మొత్తంలో చేతులు మారినట్టు ప్రచారం జరిగింది. ఈ దందా వెనుక నాటి మంత్రి బొత్స పేషీతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది హస్తం వున్నట్టు కూటమి భావిస్తోంది. అందుకే విద్యాశాఖ కమిషనర్‌తో కీలక ఆదేశాలు ఇప్పించినట్టు తెలిసింది.
ఉపాధ్యాయ బదిలీలకు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా జగన్ సర్కార్ విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి, వెబ్ కౌన్సెలింగ్ కూడా నిర్వహించాలని నిర్ణయమైంది. అయితే ఇందుకు విరుద్ధంగా సాగిన బదిలీలపై నూతనంగా ఏర్పడే ప్రభుత్వం సీరియస్‌గా వుంది. అందుకే బదిలీలకు బ్రేక్ వేయాలని కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో బదిలీల అవినీతి ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే భయం అధికారుల్లో చూడొచ్చు.