ఎన్నికల యుద్ధంతో తాను అభిమన్యుడిని అని, మీరంతా (వైసీపీ శ్రేణులు) శ్రీకృష్ణుడితో సమానమని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఔను, ఎన్నికలంటే యుద్ధమే. ఈ యుద్ధంలో సోషల్ మీడియా అత్యంత శక్తిమంతమైన ఆయుధం. ఒక మాటలో చెప్పాలంటే అణుబాంబులాంటిది. ఎన్నికల కురుక్షేత్రంలో సోషల్ మీడియాకు ప్రతి రాజకీయ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇవ్వడాన్ని చూశాం.
సోషల్ మీడియా గురించి బాగా తెలిసిన వ్యక్తుల చేతల్లో పెడుతుంటారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి రూటే సపరేట్. తనకు బాగా తెలిసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌కు తన పార్టీ సోషల్ మీడియాను అప్పగించారు. సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా గురించి అద్భుతమైన పరిజ్ఞానం వుంటే …జగన్ నిర్ణయాన్ని సమర్థించొచ్చు. కానీ ఫేస్బుక్లో, ట్విటర్లో కనీసం ఖాతా కూడా లేని సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారంటే ఏమనుకోవాలి?
రెండేళ్ల క్రితం భార్గవ్‌కు వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తున్న ఆయనకు తోడుగా చల్లా మధు, రత్నాకర్‌ను నియమించారు. అయినా వాళ్లతో కలిసి భార్గవ్ చేసింది ఏమైనా వుందా? అంటే… ఏమీ లేదనే సమాధానం వస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలో భార్గవ్ ఇతర సోషల్ మీడియా చానళ్లు, ప్రతినిధులను ఏ మేరకు వైసీపీ కోసం పని చేసేలా చక్రం తిప్పారంటే… దానికీ సమాధానం నిల్.
చంద్రబాబు మనిషిగా గుర్తింపు పొందిన ఒక మహిళా యాంకర్‌కు కోట్లాది రూపాయలు ముట్టచెప్పి, హమ్మయ్య ఇంతటితో తన బాధ్యత తీరిందని భార్గవ్ రిలాక్ష్ అయ్యారు. సదరు యాంకరమ్మ తనకు తోచినట్టుగా వైసీపీ నాయకులతో ఇంటర్వ్యూలు చేసి, కొంత మందితో చేయించి…. ఎన్నికల్లో మమ అనిపించారు. కోట్లాది రూపాయల్ని సొంతం చేసుకున్నారు. ఇదే వైసీపీ గెలుపు కోసం తాపత్రయ పడి తమకు తోచిన రీతిలో స్వచ్ఛందంగా పని చేసే వాళ్లను భార్గవ్ పట్టించుకున్న పాపాన పోలేదు.
భార్గవ్ పట్టించుకున్నదల్లా గోడ మీద పిల్లి లాంటి జర్నలిస్టులను. ఒకవైపు ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే, కూటమి భజన మొదలు పెట్టిన సోషల్ మీడియా ప్రభావశీల జర్నలిస్టులను గమనిస్తే… వారంతా భార్గవ్ డబ్బులిచ్చి పెంచి పోషించిన వ్యక్తులే కావడం గమనార్హం.
ఎన్నికల్లో వైసీపీపై వ్యతిరేకత పెంచే అంశాల్ని గుర్తించి, వాటిని సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టడంలో భార్గవ్ నాయకత్వం పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకు ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై టీడీపీ, జనసేన విస్తృతంగా దుష్ప్రచారం చేశాయి. కానీ వాటిని తిప్పి కొట్టడానికి వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రయత్నం చాలా స్వల్పం. మరి వైసీపీ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని భార్గవ్ ఏం చేశారయ్యా అంటే… ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
తన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే తనపై ప్రత్యర్థులు, లేదా సొంత పార్టీకి చెందిన వారెవరైనా విమర్శలు చేస్తే, పార్టీ సోషల్ మీడియా సైన్యంతో తీవ్ర ఎదురు దాడి చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట వినని సొంత పార్టీ నాయకుల్ని జగన్‌ను కలవనీయకుండా చేసేవారు. అలాగే అలాంటి వాళ్లపై ఏదో ఒక సాకుతో కేసులు నమోదు చేయించి చిత్రహింసలు పెట్టించే వారు. ఇందుకు నిలువెత్తు ఉదాహరణ పిన్నెల్లి సోదరులే. పల్నాడులో మాచర్ల అంటే గిట్టని ఏఎస్పీకి పోస్టింగ్ వేయించి, ముప్పుతిప్పలు పెట్టించారనే ప్రచారం వుంది. ఇంకో ప్రచారం కూడా ఏంటంటే…సొంత పార్టీ నేతలపై ఎల్లో మీడియాలో వార్తలు రాయించడం వెనుక సజ్జల మార్క్ వుందని వైసీపీలో ఓ చర్చ వుంది. జగన్ రాజకీయ ప్రయోజనాలు పక్కకు పోయాయి. సజ్జల కుటుంబ గౌరవ, ప్రతిష్టలకే సోషల్ మీడియాలో భార్గవ్ పెద్దపీట వేశారనే విమర్శ వుంది.
సోషల్ మీడియాలో ప్రత్యర్థుల దుష్ప్రచారంపై తిప్పి కొట్టడానికి కావాల్సినంత కంటెంట్ ఉన్నప్పటికీ, సరైన రీతిలో ఉపయోగించడంలో భార్గవ్ పూర్తిగా విఫలమయ్యారని చెప్పక తప్పదు. ఎవరినైనా డబ్బుతో నోళ్లు మూయించొచ్చనే ధ్యాస తప్ప, వైసీపీ గ్రాఫ్ పెంచే పని చేయడంపై దృష్టి సారించలేదన్న అభిప్రాయం వుంది. వైసీపీ అధికారంలో ఉండడం, సోషల్ మీడియాకు భారీ బడ్జెట్ కేటాయించడం అందరికీ తెలిసిందే. మరి ఈ డబ్బంతా ఎవరికిచ్చారు? ఎందుకిచ్చారు? ఏం చేశారనే చర్చకు తెరలేచింది.
వైసీపీ మండల, తాలూకా, జిల్లా సోషల్ మీడియా ప్రతినిధులకు కూడా భార్గవ్ రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెబుతున్నారు. మనోడు కదా అని సజ్జల భార్గవ్‌కు సోషల్ మీడియా బాధ్యతల్ని అప్పగిస్తే, ఆ యువ నాయకుడు మాత్రం పార్టీ కోసం కాకుండా, ఇతరత్రా ఎక్కువ ఉపయోగించారని సంబంధిత యాక్టివిస్టులు చెబుతున్నారు. వైసీపీ ఘోర పరాజయంలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు… సోషల్ మీడియా హెడ్ భార్గవ్ పాత్ర కూడా వుందని మెజార్టీ అభిప్రాయం. రెండేళ్ల పాటు సజ్జల భార్గవ్ సోషల్ మీడియా వేదికగా ఏదో చేస్తున్నట్టు జగన్‌కు “షో” చూపించారు. జగన్ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమవుతోంది.
సోషల్ మీడియా పేరుతో భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందిన సజ్జల భార్గవ్ కుటుంబం బాగుంది. ఇప్పుడు అధికారం పోగొట్టుకుని వీధినపడ్డది జగన్, ఆయన్ను నమ్ముకున్నోళ్లే.