టాలీవుడ్ కు జగన్ చేసిన అన్యాయం అంటూ వినిపించే ఆరోపణ ఒకటే. ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించేసారు. అది కేవలం పవన్ కళ్యాణ్ మీద కోపంతో చేసారు అనేదే. కానీ దాని వల్ల మంచే జరిగిందని వాదించేవారు కూడా టాలీవుడ్ లో వున్నారు.
సినిమా థియేటర్ టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం వల్లనే నైజాంలో థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వుంది. తక్కువ రేట్లతో కూడా ఉత్తరాంధ్ర లాంటి ఏరియాల్లో మంచి కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. మరో పక్క ఈ తక్కువ రేట్లతో కూడా కృష్ణ, వెస్ట్ లాంటి ప్రాంతాల్లో సరైన ఫుట్ పాల్ నమోదు కావడం లేదు.
ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం మారింది ఆంధ్రలో. ఇండస్ట్రీతో చాలా సన్నిహిత సంబంధాలున్న చంద్రబాబు సిఎమ్ అయ్యారు. థియేటర్ టికెట్ రేట్లు పెంచమని ఇండస్ట్రీ పెద్దలు అడుగుతారా? అలా అడిగితే గతంలో వుండే రేట్ల మేరకు మళ్లీ సవరిస్తారా? లేక అంతకన్నా పెంచుతారా? లేదూ ఇలాగే వుంచమని చెప్పి, పెద్ద సినిమాలకు పెద్ద రేట్లు తీసుకుంటారా?
కొత్త ప్రభుత్వం వచ్చాక ముందుగా వస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా నిర్మాత తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ అభిమాని అశ్వనీదత్. ఆయన ఏ మేరకు రేట్లు ఇవ్వమంటే ఆ మేరకు ఇస్తారు చంద్రబాబు. అందులో సందేహం లేదు. పైగా ఆ సినిమా ఆంధ్ర ఏరియాకు 90 కోట్ల మేరకు అడ్వాన్స్ ల మీద ఇచ్చారు. అందువల్ల అశ్వనీదత్ కే రికవరీ చాలా ముఖ్యం. సినిమాకు వున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుని, తొలి వారంలోనే మాగ్జిమమ్ రాబట్టుకోవడానికి స్పెషల్ రేట్లు, స్పెషల్ షోలు అడగవచ్చు. అంతవరకు ఫరవాలేదు.
అలా కాకుండా రెగ్యులర్ రేట్లు పెంచమని టాలీవుడ్ అడిగితే అది ఇబ్బందులకే దారి తీస్తుంది. ఎందుకంటే ఎంత హడావుడి చేసినా, ఇప్పటికే ఏ సినిమాకు కూడా సరైన ఓపెనింగ్ పడడం లేదు. ఇక రేట్లు పెంచితే మరింత కష్టం అవుతుంది. మరి అయినా కూడా పెంచమని అడిగే ధైర్యం టాలీవుడ్ చేస్తుందా? ఏమో..చూడాలి.