చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసే ముహూర్తం మారిందా? తొలుత ఆయన 9న ప్రమాణం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు 12న ప్రమాణ స్వీకారానికి ముహూర్తం మార్చుకున్నట్టుగా వినిపిస్తోంది.
జూన్ 9న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. ఆ కార్యక్రమానికి ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కూడా హాజరు అవుతున్న నేపథ్యంలో అదేరోజున అమరావతిలో ప్రమాణం స్వీకారం సాధ్యం కాదు గనుక, చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారాన్ని 12వ తేదీకి మార్చుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
అయితే, 12 వ తేదీ బుధవారం అంత మంచిరోజు కాదని పండితులు అభిప్రాయపడుతున్నారు. మనం అనుసరించే పంచాంగ గణనల ప్రకారం ఆరోజు తిథి షష్ఠి అవుతుంది. సాధారణంగా ఒక శుభకార్యం తలపెడుతున్నప్పుడు వారం, తిథిని మాత్రమే ప్రధానంగా పరిగణిస్తారు. షష్ఠి నష్ఠి అనేది సామెత. అంటే షష్ఠి నాడు ప్రారంభించిన ఏ కార్యం అయినా సరే.. నష్టంతోనే ముగుస్తుంది అని అంటారు. అలాంటిది.. తనజీవితంలో చివరి చాన్స్ ఇవ్వమని ప్రజలను కోరి, వారి మద్దతు పొందగలిగి అధికారం చేపడుతున్న చంద్రబాబు.. అందుకు షష్ఠి తిథిని ఎందుకు ఎంచుకున్నారో అర్థం కావడం లేదు.
జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ వారి మీటింగులో 151 కంటె ఎక్కువ సీట్లు గెలుస్తున్నాం అని చెప్పిన తర్వాత.. బొత్స సత్యనారాయణ 9వ తేదీన ఆయన విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ఆరోజు తిథి తదియ అవుతుంది. ‘విదియ తదియలందు విభవమ్ము చేకూరు’ అని శాస్త్రం చెబుతుంది గనుక.. 8న శనివారం విదియ అయినప్పటికీ.. 9న ఆదివారం కాబట్టి ఎక్కువ మంది హాజరు కావడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఆ తేదీని నిర్ణయించారు.
చంద్రబాబు అఖండ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత.. ఆయన కూడా అదే రోజున ప్రమాణం చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మంచిరోజు కావడంతో మోడీ కూడా అదే రోజున ప్రమాణం చేస్తున్నందున, ఇప్పుడు చంద్రబాబు మార్చుకోవాల్సి వచ్చింది.
అంతవరకు ఓకే గానీ.. 12న షష్ఠినాడు ఎందుకు ముహూర్తం ఎంచుకున్నారు? అనే చర్చ పలువరిలో నడుస్తోంది.. దాని బదులు 13 న సప్తమినాడు ముహూర్తం పెట్టుకోవచ్చు గానీ.. విదేశాలలో 13 అనేది అశుభసూచకంగా భావిస్తారు. 14వ తేదీకి వెళితే.. అష్టమి కూడా అశుభంగా భావిస్తారు. 9న కాకుండా 10న చేయాలనుకుంటే ఆ రోజు చవితి మంచిది కాదు. 11న పంచమి మంచిదే గానీ, మంగళవారం అవుతుంది. ఈ రకంగా 9వ తేదీ దాటితే చంద్రబాబునాయుడుకు ప్రమాణ స్వీకారానికి సరైన ముహూర్తం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.