ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగింది. ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చారు. జగన్ పాలన వద్దని అన్ని వర్గాల ప్రజలు ఓటు ద్వారా తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల తీర్పే శిరోధార్యం. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముందున్న తక్షణ కర్తవ్యం… ప్రజాతీర్పుపై పోస్టుమార్టం చేసుకోవడం.
తన పాలనలో తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకోవడం. ముందుగా తన వ్యతిరేక ఓటర్లను ఆయన కలవాలి. తనపై కక్ష కట్టినట్టుగా ఓట్లు వేయడానికి దారి తీసిన పరిస్థితుల్ని ఆయన తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ప్రజాస్వామ్యంలో ఏ తీర్పు శాశ్వతం కాదు. 2019లో వైసీపీకి 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ సీట్లు వస్తే… అంతా ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టారు. ఈ ఎన్నికల్లో అంతకు మించిన ఆశ్చర్యం. వైసీపీ ప్లేస్‌లో టీడీపీ. నాడు చంద్రబాబునాయుడు కుంగిపోయి వుంటే, నేడు ఈ ఘన విజయం దక్కేది కాదు.
ఇప్పుడు కూటమి విజయం అనే దానికంటే వైఎస్ జగన్ ఓటమిగా చూడాలి. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లపై ప్రత్యేక ప్రేమతో పట్టం కట్టారని టీడీపీ, జనసేన నాయకులు అనుకుంటూ వుండొచ్చు. కానీ జగన్‌పై వ్యతిరేకతే వారికి అనుకూలంగా మారిందనేది నిజం.
ఎన్నికల ముందు వైఎస్ జగన్ అనేక రకాలుగా సర్వేలు చేయించారు. వాటికి అనుగుణంగా అభ్యర్థుల మార్పు పెద్ద ఎత్తున చేశారు. కానీ తననే మార్చాలని జనం డిసైడ్ అయ్యారని ఆయన పసిగట్టలేకపోయారు. తన పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనుకున్న చోట అటూఇటూ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. చివరికి ఎన్నికల ఫలితాలు జగన్‌కు గట్టి షాక్ ఇచ్చాయి.
ఇప్పటికైనా జగన్ కూల్‌గా ఆలోచించాలి. తనలో మార్చుకోవాల్సిందేంటో ఉందని తెలుసుకోవాలి. తండ్రికి మించి ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయనలో వుంది. కానీ ప్రజలతోనూ, నాయకులతోనూ కలిసిపోవడంతో తన తండ్రిని మార్గదర్శకంగా తీసుకోవాలని ఇప్పటికైనా జగన్ గుర్తిస్తే మంచిది. అధికారం వచ్చిన తర్వాత గుడిలో దేవుడిలా.. తాడేపల్లిలో ఇంటికే పరిమితం కావడాన్ని జనం జీర్ణించుకోలేకపోయారు.
అలాగే తన పార్టీ కార్యకర్తలు, నాయకులతో సంబంధం లేకుండానే ఐదేళ్ల పాలన సాగించారు. సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకు పాలన చేరువ చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థతో తమను డమ్మీ చేశారని సొంత పార్టీ నాయకులు కోపాన్ని పెంచుకున్నారు. దీంతో ఓడించాలన్న కసి వారిలో పెరిగింది. అలాగే కంచుకోటలాంటి రాయలసీమలో కూడా ఎన్నడూ లేని విధంగా వైసీపీని ఓటుతో చితక్కొట్టడానికి దారి తీసిన పరిస్థితుల్ని నిర్మొహమాటంగా విశ్లేషించుకోవాలి. ఏ సామాజిక వర్గం కూడా తన వెంట నిలవలేకపోవడం వెనుక బలమైన కారణాన్ని జగన్ తెలుసుకోవాలి.
చిన్న చిన్న విషయాలే జగన్ ఘోర పరాజయానికి దారి తీశాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకుని తనకు తాను కొత్తగా ఆవిష్కృతం కావడానికి ప్రయత్నించాలి. మారిన జగన్‌ను చూస్తే తప్ప, రాజకీయ మనుగడ సాధ్యం కాదని గ్రహించాలి. ఇందుకు మరెవరినో రోల్ మోడల్‌గా తీసుకోనవసరం లేదు. తన తండ్రి వైఎస్సార్ ప్రజలు, నాయకులు, చివరికి ప్రత్యర్థులతో ఎలా మెలిగే వారో అధ్యయనం చేస్తే సరిపోతుంది. మనిషిలో మంచి మార్పును ఆహ్వానించని సమాజం వుండదు. తన నుంచి ప్రజానీకం కోరుకుంటున్న దానికి అనుగుణంగా, భవిష్యత్‌లో ముందడుగు వేస్తే, తప్పక ఉజ్వల భవిష్యత్ వుంటుంది జగన్ గ్రహించాలి. అందుకు అనుగుణంగా సానుకూల నిర్ణయం తీసుకోవడం జగన్ చేతల్లో వుంది.