వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలపై వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. ఏదో జరిగిందని అనొచ్చని, కానీ అందుకు తగ్గ ఆధారాలు లేవని జగన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే అర్థం ధ్వనించేలా జగన్ మాట్లాడ్డం, ఆ తర్వాత వైసీపీ నాయకులంతా అదే ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదని అనేక సందర్భాల్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని వైసీపీ నేతలు ఆవేదనలో విమర్శిస్తున్నారు. వారి విమర్శలో నిజం వుందని అనుకోలేం కానీ జనం ఏమనుకుంటున్నారనేదే కీలకం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జనాభిప్రాయమే అన్నింటికంటే ముఖ్యం.
మెజార్టీ ప్రజలు మాత్రం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే వాదనను నమ్ముతున్నారు. ఇందులో నిజానిజాల సంగతిని కాసేపు పక్కన పెడదాం. ఈ రకమైన అభిప్రాయానికి ఎందుకొస్తున్నారంటే… జగన్ తప్పులు చేసి వుండొచ్చని, కానీ ఇంత ఘోరంగా ఓడించేంత నేరాలు ఆయన చేయలేదనే బలమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల సందర్భంలో జగన్ మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 95 శాతం అమలు చేశారని ఓటర్లు గుర్తు చేస్తున్నారు.
జగన్కు ఓటు వేయని వారు సైతం… ఏదో జరిగి వుంటే తప్ప, వైసీపీకి ఇంతటి పరాభవం ఎదురయ్యే అవకాశం లేదని అంటున్నారు. అందుకే వైసీపీకి ఘోర ఓటమి, జగన్ కామెంట్స్ నేపథ్యంలో, ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన వారిలో సైతం ఎంతోకొంత సానుభూతి కనిపిస్తోంది.