సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమాలో ప్రతి అంశం కొత్తగా ఉంటుందని మనకు తెలుసు. దీనికి సంబంధించి టీజర్, గ్లింప్స్ లో కొన్ని చూశాం. ఫస్ట్ లుక్ పోస్టర్లు, వాటికి సంబంధించిన వీడియోల్లో కూడా మరికొన్ని చూశాం.
అయితే అసలైన కల్కి ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు మరో 5 రోజుల్లో సమాధానం దొరుకుతుంది. 10న కల్కి సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేస్తున్నారు. ఇందులో కల్కి వరల్డ్ తో పాటు, సినిమా కాన్సెప్ట్ ను కొద్దిగా రివీల్ చేసే అవకాశం ఉంది.
2898 నాటి భవిష్యత్ ప్రపంచాన్ని ఊహించుకొని ఈ సినిమాలో సెట్స్ వేశారు. వేసుకునే దుస్తులు, తినే ఆహారం, తిరిగే వాహనాలు, వాడే ఆయుధాలు… ఇలా ప్రతి అంశంలో భవిష్యత్ ను కొత్తగా చూపించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బయటకొచ్చిన ‘బుజ్జి’ కారు.. దేశం మొత్తాన్ని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ట్రయిలర్ రిలీజైన తర్వాత ఇలాంటి మరిన్ని కొత్త అంశాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకోన్, దిశా పటానీ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. కీలక పాత్రలో అమితాబ్, విలన్ గా కమల్ హాసన్ నటించారు. 27న థియేటర్లలోకొస్తోంది కల్కి.