కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేయాలో చెప్పిన ష‌ర్మిల‌

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఏర్పాటుకానున్న కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేయాలో స‌ల‌హాలిచ్చారు. ముందుగా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌కు ఆమె శుభాకాంక్ష‌లు చెప్పారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ఏర్పాటు కానున్న నూత‌న ప్ర‌భుత్వం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి…

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఏర్పాటుకానున్న కూట‌మి ప్ర‌భుత్వం ఏం చేయాలో స‌ల‌హాలిచ్చారు. ముందుగా చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌కు ఆమె శుభాకాంక్ష‌లు చెప్పారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు ఏర్పాటు కానున్న నూత‌న ప్ర‌భుత్వం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాల‌ని ఆమె కోరారు. సంక్షేమం, అభివృద్ధి స‌మానంగా జ‌ర‌గాల‌ని ఆమె అన్నారు. అలాగే విభ‌జన చట్టంలో పేర్కొన్న ప్ర‌కారం రాష్ట్రానికి రావాల్సినవి సాధించాల‌ని ఆమె సూచించారు.

మొద‌ట‌గా ఏపీకి ప్ర‌త్యేక హోదా తీసుకురావాల‌ని కోరారు. పోల‌వ‌రం స‌హా అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేయాల‌న్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం జ‌ర‌గాల‌న్నారు. నిరుద్యోగ యువ‌త‌కు భారీగా ఉద్యోగాలు ఇవ్వాల‌ని కోరారు. ప్ర‌త్యేక హోదా అనేది రాష్ట్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌తో పాటు రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంలో హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు.

విభ‌జ‌న హామీలు నెర‌వేరుస్తామ‌నే హామీతోనే కేంద్రంలో ఏర్పాటు కానున్న బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్దతు ఇవ్వాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇంత వ‌ర‌కూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేసింద‌న్నారు. రానున్న రోజుల్లో కూడా తాము అదే పాత్ర పోషిస్తామ‌ని ఆమె చెప్పారు. జ‌నం గొంతుక‌గా తాము వుంటామ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.  ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డ‌తామ‌ని ఆమె హెచ్చ‌రించారు.