వైసీపీ ఘోర పరాజయానికి దారి తీసిన పరిస్థితులపై ఆ పార్టీ నాయకులు సమీక్షించుకుంటున్నారు. ఎందుకిలా జరిగిందనే పోస్టుమార్టమ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు, చెత్త కోటరీ వుందని ఘాటు విమర్శ చేశారు.
అబద్ధం చెప్పకూడదు, రాజకీయాల్లో నిజాయితీగా వుండాలనే జగన్ తీరులో నిజంగా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారేమో అన్నారు. తమ వైపు నుంచి ఏవైనా తప్పులున్నాయేమో అని మాట్లాడుకోవాల్సి వస్తే… జగన్‌ను ఒక ట్రాన్స్‌లో పెట్టి , చుట్టూ ఒక కవచంలా వున్నారని ఆయన విమర్శించారు. ధనుంజయరెడ్డి లాంటి పనికిమాలిన, చెత్త అధికారి జగన్ దగ్గర ఉన్నాడని ఘాటు విమర్శ చేశారు. ఏదైనా అర్జీ తీసుకెళితే, ఆయనే సీఎంలా ఫీల్ అయ్యి, తన రూమ్ వద్దే గంటల తరబడి కూచోపెట్టుకుంటాడన్నారు.
కూచోపెట్టి కూడా కాదు, నిల్చోపెట్టే వాడన్నారు. లోపలికి వెళితే ఎమ్మెల్యేతో కనీసం రెండు నిమిషాలు కూడా మాట్లాడ్డానికి తీరిక లేనట్టుగా వ్యవహరించేవాడని ధనుంజయరెడ్డిపై నిప్పులు చెరిగారు. తాము అడిగే పనుల గురించి సరిగా అర్థం చేసుకోలేదంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఒక పని విషయమై ధనుంజయరెడ్డి దగ్గరికి వెళితే, రేపు, ఎల్లుండి అంటూ ఐదేళ్లు తిప్పుకున్నాడని విమర్శించారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని అడిగితే, రేపు, ఎల్లుండి అంటూ ఐదు సంవత్సరాలు గడిపాడని విమర్శించారు. విదేశీ విద్యా పథకానికి సంబంధించి పేద కాపు విద్యార్థుల బకాయిలను క్లియర్ చేయాలని అడిగితే, రేపు, ఎల్లుండి అంటూ ఐదేళ్లు తిప్పుకున్నాడని ధనుంజయరెడ్డిపై విమర్శలు చేశారు.
జగన్‌కు ఏదైనా చెబితే, ఆయన గుడ్డి విశ్వాసం, నమ్మకంతో ధనుంజయరెడ్డిని పిలిచి చెప్పేవాడన్నారు. ధనుంజయరెడ్డి చేతిలోకి ఏ కాగితం వెళ్లినా అంతే సంగతులన్నారు. ఒకట్రెండు కాదు, వందల సమస్యలు చెప్పొచ్చన్నారు. కొత్తగా గెలవడంతో ఏదైనా చేయాలనే తపనతో అధికారుల దగ్గరకు వెళితే, సరైన స్పందన లభించేది కాదని జక్కంపూడి రాజా ఆవేదన చెందారు. తండ్రికి మించి ప్రజలకు ఏదైనా చేయాలని జగన్ తపన పడే వారన్నారు. తాను మంచి చేసి వుంటేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక దమ్మున్న సీఎం జగన్ అని ఆయన అన్నారు. జగన్ గెలిచినా, ఓడినా రియల్ హీరో అన్నారాయన.
జగన్ చుట్టూ ఉన్న కోటరీ, పనికిమాలిన కొంత మంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారని జక్కంపూడి రాజా సంచలన ఆరోపణ చేశారు. జగన్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జగన్‌ను ఒక ట్రాన్స్‌లో పెట్టే ప్రయత్నం చేశారని రాజా ఆవేదన వ్యక్తం చేశారు.