కూటమికి ఘన విజయం దక్కడంతో ఇక తమకు ఎదురే లేదని సంబంధిత నేతలు భావిస్తున్నారు. దీంతో తమకు అడ్డూఅదుపూ లేదనే లెక్కలేనితనం ద్వితీయ శ్రేణి నాయకుల్లో కనిపిస్తోంది. బహుశా విజయం తీసుకొచ్చే అహంకారం అలా వుంటుందేమో. తాజాగా తిరుపతిలో వైసీపీ నాయకులకు టీడీపీ, జనసేన నుంచి వేధింపులు మొదలయ్యాయి.
గత రాత్రి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి, అలాగే మరో కార్పొరేటర్, అతని అనుచరులకు వార్నింగ్, ఇంటిపై దాడికి తెగబడ్డారు. శ్రీదేవి ఇంటిపై దాడి చేయడంతో పాటు టీడీపీ జెండాను పెట్టుకోవాలంటూ హుకుం జారీ చేయడం గమనార్హం. దీంతో శ్రీదేవి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన ప్రాణం పోయినా వైసీపీలోనే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. తన ఇంటిపై టీడీపీ దాడికి పాల్పడడంతో చుట్టుపక్కల కుటుంబాలు భయాందోళనలకు లోనవుతున్నారన్నారు. తన ఇంటిపై టీడీపీ జెండాను పెట్టాలని, లేదంటే అంతు చూస్తామని హెచ్చరించారని ఆమె ఆరోపించారు. ఇలాంటి దాడులకు బెదిరేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఎవరెంతగా భయపెట్టినా వైసీపీలోనే కొనసాగుతానని ఆమె తేల్చి చెప్పారు.
అలాగే మరో కార్పొరేటర్, అతని అనుచరులకు నాల్గో తేదీ సాయంత్రం నుంచి టీడీపీ, జనసేన నాయకులు ఫోన్ చేస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు కూడా తమనే హెచ్చరించినట్టు బాధిత వైసీపీ నాయకులు చెబుతున్నారు. తమను భయపెట్టి, లొంగదీసుకుని టీడీపీలో చేర్చుకోవాలనే ఎత్తుగడలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారని బాధితులు తెలిపారు.