ఏపీలో వైసీపీ ఘోర పరాజయంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి ఇంత అధ్వానంగా సీట్లు వస్తాయని అనుకోలేదని మెజార్టీ అభిప్రాయం. సీఎంగా జగన్ చేసిన తప్పిదాలే కూటమికి కలిసి వచ్చాయని వైసీపీ నేతలు కూడా చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలపై తన మార్క్ అభిప్రాయాల్ని వెల్లడించారు.
కూటమికి ఇంతటి ఘన విజయం దక్కడానికి కారణమైన వైఎస్ జగన్‌కు చంద్రబాబునాయుడు ముందుగా థ్యాంక్స్ చెప్పాలని నారాయణ అన్నారు. జగన్ ఇంటికెళ్లి చంద్రబాబు విష్ చేయాలని నారాయణ సూచించారు. ఏపీలో ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఫలితాలు వచ్చాయన్నారు. జగన్‌పై వ్యతిరేకత కూటమికి కలిసొచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. పంతాలు, పట్టింపులకు వెళ్లకుండా అభివృద్ధిపై కూటమి దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
సంక్షేమ పథకాల ద్వారా అధికారం వస్తుందని అనుకోవడం తప్పని రుజువైందని నారాయణ అన్నారు. అభివృద్ధి చేయడం ద్వారానే అధికారం వస్తుందని జగన్ గుర్తించలేకపోయారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చేలా చేశాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదన్నారు.
తమిళనాడులో డీఎంకే నేత, సీఎం స్టాలిన్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తమిళనాడులో అన్ని పార్టీలను కలుపుకుని వెళ్లడం వల్లే ఇండియా కూటమి మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. తెలంగాణలో వామపక్షాలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు.