వాలంటీర్లపై జనసేనాని పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. దీంతో పవన్‌కల్యాణ్ తాను వాలంటీర్లందరినీ అనలేదంటూ నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇదే సందర్భంగా కేంద్ర నిఘా వర్గాలు తనకు వాలంటీర్ల అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇచ్చాయని, ప్రజలకు చెప్పాలని సూచించినట్టు బహిరంగంగానే పవన్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ గుర్రుగా వుంది.
మరోవైపు ఒక బలమైన శక్తిగా అవతరించిన వాలంటీర్ల విషయంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. పవన్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు విరుచుకుపడుతున్నారు. తమను బ్రోకర్లుగా చిత్రీకరిస్తావా? అంటూ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఔనన్నా, కాదన్నా వాలంటీర్లు రానున్న ఎన్నికల్లో క్రియాశీలకం కానున్నారు. అలాంటి ఓ వ్యవస్థతో గొడవ పెట్టుకోవడం అంటే, రాజకీయంగా నష్టపోవడానికి సిద్ధపడడమే అనే అభిప్రాయంలో టీడీపీ వుంది.
దీంతో పవన్ వ్యాఖ్యలపై టీడీపీ మౌనాన్ని ఆశ్రయించింది. సహజంగా పవన్‌పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే, వెంటనే టీడీపీ నేతలు జనసేనానికి మద్దతుగా నిలవడం చూస్తున్నాం. కానీ వాలంటీర్ల విషయంలో మాత్రం టీడీపీ నోర్మూసుకుని జాగ్రత్తగా తాజా పరిణామాలను గమనిస్తోంది. పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తే తాము కూడా వాలంటీర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని, దాని వల్ల రాజకీయంగా నష్టపోతామని టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో వాలంటీర్ల విషయంలో పవన్ కల్యాణ్ ఒంటరి వాడయ్యారు.
వాలంటీర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నిఘా వర్గాలు తనకు చెప్పాయనడం ద్వారా అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారనే అభిప్రాయం బీజేపీలో వుంది. వాలంటీర్లపై పవన్ విచక్షణ లేకుండా మాట్లాడారనేది బీజేపీ అంతర్గత చర్చల్లో నిర్ధారించారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే, చివరికి ఎవరూ మద్దతు ఇవ్వరని ఇప్పటికైనా పవన్ గ్రహించాల్సిన అవసరం వుంది.