ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి పెళ్లి బృందం బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో 35 మంది నుంచి 40 మంది ఉన్నట్లు సమాచారం. కాల్వలో నీరులేకపోవడంతో ప్రాణనష్టం భారీగా తగ్గినట్లు తెలుస్తొంది. సాగర్ కాల్వ రిటైనింగ్ వాల్‌ను ఢీకొట్టి దాదాపు 30అడుగుల లోతులో ఉన్న కాల్వలోకి బస్సుదూసుకెళ్లింది. బస్సు వెనుక సీట్లలో కూర్చున వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు గాయపడిన వారిని రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కాగా వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకుంది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.