పార్ట్ టైమ్ జాబ్స్ అంటూ ఆన్ లైన్ లో లింక్స్ కనిపిస్తే అస్సలు క్లిక్ చేయొద్దని పోలీసులు ఇదివరకే చాలాసార్లు ప్రకటించారు. ఒకవేళ అలాంటి లింక్స్ క్లిక్ చేసినా, సెన్సిటివ్ సమాచారాన్ని అందించొద్దని కూడా హెచ్చరించారు. కానీ అదనపు ఆదాయానికి ఆశపడి చాలామంది ఇలాంటి లింక్స్ క్లిక్ చేసి మోసపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ లో ఒకే రోజు ఇద్దరు ఈ తరహా ఆన్ లైన్ మోసానికి బలయ్యారు. వీళ్ల నుంచి ఏకంగా 53 లక్షల రూపాయలు కొట్టేశారు సైబర్ మోసగాళ్లు.
ముందుగా వీళ్లిద్దరికీ లింక్స్ పంపించారు సైబర్ మోసగాళ్లు. వాటిని క్లిక్ చేసి టాస్క్ పూర్తిచేస్తే డబ్బులిస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే నిజంగానే డబ్బులిచ్చారు. దీంతో వీళ్లకు నమ్మకం కుదిరింది.
ఆ తర్వాత ఈ ఇద్దరితో విడతలవారీగా పెద్దమొత్తంలో డబ్బు గుంజారు మోసగాళ్లు. ఎంత పెట్టుబడి పెడితే, దానికి రెండింతలు వస్తుందని ఆశ చూపారు.
అలా ఓ వ్యక్తి నుంచి 48 లక్షల రూపాయలు, మరో మహిళ నుంచి 5 లక్షలు కాజేశారు. ఆ తర్వాత అన్ని లింక్స్ కట్ అయిపోయాయి. ఎలాంటి కమ్యూనికేషన్ లేదు
దీంతో మోసపోయామని గ్రహించిన వీళ్లిద్దరూ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ లో ఆశపడితే, అసలుకే మోసం వస్తుందనే విషయం తాజా ఘటనతో మరోసారి రుజువైంది.