కష్టజీవి గురుమూర్తికి ప్రజల ఇచ్చిన కానుక ఇది!

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏకంగా 22 ఎంపీ స్థానాలను గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2024 వచ్చేసరికి కేవలం నాలుగు స్థానాలకు పడిపోయింది. అరకు, రాజంపేట, కడప, తిరుపతి స్థానాలను మాత్రమే ఈసారి గెలుచుకుంది.…

2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఏకంగా 22 ఎంపీ స్థానాలను గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2024 వచ్చేసరికి కేవలం నాలుగు స్థానాలకు పడిపోయింది. అరకు, రాజంపేట, కడప, తిరుపతి స్థానాలను మాత్రమే ఈసారి గెలుచుకుంది. అరకు ఎంపీ పరిధిలో వైసిపికి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా దక్కాయి. అలాగే రాజంపేట, కడప ఎంపీ సీట్ల పరిధిలో కూడా వారికి కొన్ని  ఎమ్మెల్యే సీట్లు దక్కాయి.

కానీ తమాషా ఏమిటంటే తిరుపతి ఎంపీ సీటు పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలవలేదు. అయితే ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి మంచి చెప్పుకోదగిన మెజారిటీతోనే గెలిచారు. ఆయనకు దాదాపు 15 వేల ఓట్ల మెజారిటీ లభించింది. అంటే తిరుపతి ఎంపీ నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థి మద్దెల గురుమూర్తికి అనుకూలంగా గణనీయమైన స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగింది అనేది స్పష్టం అవుతోంది.

కష్టజీవిగా ఉంటూ, ప్రజల కష్టం తెలిసిన మనిషిగా తాను ఎంపీ అయినందుకు- నియోజకవర్గానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనతో మాత్రమే పని చేసినందుకు ఫలితంగానే మద్దెల గురుమూర్తిని ప్రజలు మళ్ళీ ఆశీర్వదించి గెలిపించారనే మాట ఇప్పుడు నియోజకవర్గంలో వినిపిస్తోంది.

మద్దెల గురుమూర్తి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనది రాజకీయ కుటుంబం కానే కాదు. లోక్ సభ ఎంపీగా పోటీ చేయడానికి తగిన ఆర్థిక వనరులు, శక్తి సామర్థ్యాలు ఉన్న కుటుంబం కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా గురుమూర్తి ఉన్నారు. పాదయాత్ర పొడవునా ఆయనతో పాటు పాల్గొన్నారు.

తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే ఆశ్రితులకు మేలు చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి 2019లో తిరుపతి ఎంపీగా గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ మరణం తర్వాత అనివార్యమైన ఉప ఎన్నికలో మద్దెల గురుమూర్తిని అభ్యర్థిగా నిలబెట్టారు. గెలిపించి లోక్ సభకు పంపారు.

అయితే అనూహ్యంగా కలిసి వచ్చిన అదృష్టం, దక్కిన అవకాశాన్ని గురుమూర్తి సద్వినియోగం చేసుకున్నారు. ఎంపీగా ఉంటూ తన నియోజకవర్గ పరిధిలోని పేదల కోసం అనేక ప్రాజెక్టులు తీసుకురావడానికి ఢిల్లీలోని ప్రభుత్వ పెద్దలతో ఆయన కలిసి పనిచేశారు.

అమెరికా పర్యటన సందర్భంలో కూడా గూగుల్ సహా అనేక అనేక కంపెనీల చుట్టూ తిరుగుతూ వారిని వచ్చి తమ తిరుపతి నియోజకవర్గ పరిధిలో కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వారికి అవసరమైన వసతులు అన్ని తాను సమకూర్చగలనని విన్నవించారు. ఇక్కడ కూడా అనేక మంది పారిశ్రామికవేత్తలను కలిసి ఇక్కడికి పరిశ్రమలు తీసుకురావడానికి, గ్రామీణ మహిళలకు శిక్షణ కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయడానికి ఆయన నిరంతరం పరితపిస్తూ పని చేశారు.

కేవలం నిస్వార్ధంగా ప్రజలకు ఎంతో కొంత మేలు చేయాలని కష్టపడినందుకు ఆయనకు ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం మళ్లీ లభించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు చాలామంది ఓడిపోయినా సరే గురుమూర్తి గెలిచారంటే అది ఆయన కష్టాలకి తగిన ఫలితమే అని ప్రజలు అంటున్నారు.