కూటమి అధికారం దక్కించుకోవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన నాయకుడిగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారు. కూటమి అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారంటే…
“జగన్, వైసీపీ నాయకులతో నాకు వ్యక్తిగత శత్రుత్వం లేదు. వారిని హింసించడం కోసం నన్ను గెలిపించలేదు. ఇది పార్టీ శ్రేణులంతా గుర్తించుకోవాలి. ఈ గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది. అహంకారం కాదు. ఇల్లు అలకగానే పండగ కాదు. పని చేయడంలో చూపిస్తాం” అని అన్నారు.
రాజకీయాల్లో ఈ స్ఫూర్తినే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. రాజకీయాలతో నేరుగా సంబంధం లేని సామాన్య ప్రజలు సైతం ప్రశాంతంగా, సాఫీగా సమాజ గమనం వుండాలని కోరుకుంటారు. మంచి పాలకులు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కక్షపూరిత పాలనకు తెరలేపితే, ఇక సమాజంలో శాంతి వుండదు. ఈ వాతావరణాన్ని ఎవరూ కోరుకోరు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ స్ఫూర్తిదాయక కామెంట్స్ అందుకే అందరినీ ఆకట్టుకున్నాయి. పవన్ బాగా మాట్లాడారని ఆయనంటే రాజకీయంగా గిట్టని వారు సైతం అంటున్నారు. ప్రజలు అధికారం ఇచ్చేది…తమకేదైనా మంచి చేయాలని. అంతే తప్ప, రాజకీయ కక్ష సాధింపుల కోసం కాదని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సి వుంటుంది. ఈ విషయాన్ని గుర్తెరిగిన పవన్‌కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా హెచ్చరిక లాంటిదే చేశారు.
జగన్, వైసీపీ నాయకులంటే తనకు శత్రుత్వం లేదని చెప్పడం మెచ్చుకోదగ్గ మాట. కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలుంటాయనే చర్చకు తెరలేచిన నేపథ్యంలో, ప్రత్యర్థులను హింసించడం కోసం తనను గెలిపించలేదని చెప్పడం విశేషం. ఈ విషయాన్ని తన పార్టీ శ్రేణులు గుర్తించుకోవాలని పవన్ చెప్పడం అన్నిటికీ మించి గొప్ప మాట. అలాగే ఇల్లు అలకగానే పండగ కాదని పవన్ చెప్పడం ద్వారా… మేనిఫెస్టో అమలు అంత ఈజీ కాదని, ఆ బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు. ఏది ఏమైనా గెలుపు తర్వాత వినమ్రంగా మాట్లాడిన పవన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.