తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ఉంటూ వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ధర్మారెడ్డి. ఆయన ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. అయితే పదవీ విరమణ కంటే ముందుగానే.. అయినను టీటీడీ ఈవో గా తప్పించి మరొక అప్రాధాన్య పోస్టుకు పంపాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. టీటీడీ ఈవో గా పదవీ విరమణ చేసే అవకాశం లేకుండా చేయాలనేది వారి ఆలోచనగా ఉంది.
టీటీడీ బాధ్యతలలోనే ధర్మారెడ్డి సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వచ్చారు. తిరుమల జేఈవోగా ఆయన చాలా కాలం పని చేశారు. తర్వాత కార్యనిర్వహణ అధికారిగా కూడా జగన్ పదవిని కట్టబెట్టారు. అయితే టీటీడీ ధర్మకర్తల మండలిని కూడా లెక్కచేయకుండా.. స్వీయ నిర్ణయాలు తీసుకునే అధికారిగా ఆయనకు పేరు వచ్చింది. బోర్డు ఛైర్మన్ ను కూడా బైపాస్ చేస్తుంటారని గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన తీరి మీద అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జగన్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. ధర్మారెడ్డికి ఆ మేరకు స్వేచ్ఛ ఇచ్చారు.
విఐపి దర్శనాలు, తదితర ప్రోటోకాల్ వ్యవహారాలలో కూడా ధర్మారెడ్డి ఎవరినీ ఖాతరు చేయరని అంటుంటారు. జగన్ మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధం ఉండడం వలన ఆయన ప్రభుత్వంలో మరెవరిని ఖాతరు చేయరని అంటూ ఉంటారు. అలాంటి అధికారిని ఇప్పుడు పక్కకు తప్పించడానికి కొత్తగా అధికారంలోకి రాబోతున్న తెలుగుదేశం నాయకులు ఆలోచిస్తున్నారు.
వీరు పక్కకు తప్పించినా తప్పించకపోయినా జూన్ నెలాఖరుకు ధర్మారెడ్డి పదవీకాలం ముగుస్తుంది. అయితే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి హోదాలో పదవీ విరమణ చేసే అవకాశం ఇవ్వకూడదనేది తెలుగుదేశం నాయకుల ఆలోచన. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన తక్షణ చర్యలలో ఈవో ధర్మారెడ్డిని మరో అప్రధాన పోస్టుకు బదిలీ చేయడం కూడా ఒకటిఅని వారు భావిస్తున్నారు.
అయితే ధర్మారెడ్డి బుధవారం నుంచి పది రోజులు పాటు సెలవు పై వెళ్లనున్నారు. ఆయన సెలవులో ఉన్నా సరే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేయాలని తెదేపా నాయకులు ఆలోచిస్తుండడం గమనార్హం.