తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు వైసీపీ అభ్యర్థులు ఓడిపోయినా, ఎంపీగా డాక్టర్ మద్దిల గురుమూర్తి గెలుపొందారు. ఈయన గెలుపు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తన సమీప బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌పై డాక్టర్ గురుమూర్తి 14,569 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మెజార్టీని పక్కన పెడితే, కూటమి సునామీలో ఆయన గెలుపు గొప్పది. అది కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఘోర పరాజయాన్ని మూట కట్టుకోగా, ఆయన మాత్రం విజయాన్ని సొంతం చేసుకున్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని తిరుపతిలో 61,956 ఓట్లు, సూళ్లూరుపేట 29,115, శ్రీకాళహస్తి 43,304, వెంకటగిరి 16,294, గూడూరు 21,191, సర్వేపల్లిలో 16,288 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ మెజార్టీలను చూస్తే, ఏ రకంగా కూడా కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోవాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చే సరికి ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపారు.
సత్యవేడు, వెంకటగిరి ,గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీనే తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులందరూ గెలిచి, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడాన్ని కూటమి జీర్ణించుకోలేకపోతోంది.
గురుమూర్తి వ్యక్తిగత మంచితనమే ఆయనకు విజయాన్ని అందించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారాన్ని పది మందికి సాయం చేయడానికే గురుమూర్తి ఉపయోగించారని నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు వుండడం విశేషం.