వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయాల్లో లాజిక్‌ను మిస్ అయ్యారు. అలాగే ప్రజల కోణంలో చూడడం మానేసి, ఎంత సేపూ తన వైపు నుంచో ఆలోచించారు. అందుకే ఆయన పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు.
రాజకీయాల్లో నిన్న అనేది ఉండదని, రేపు అనేది మాత్రమే వుంటుందనే లాజిక్‌ను జగన్ మిస్ అయ్యారు. ఇదే భారీ మూల్యం చెల్లించుకోడానికి కారణమైంది. గత ఐదేళ్లలో వివిధ వర్గాల ప్రజలకు లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించానని, వారి ఓట్లు ఏమయ్యాయో తనకు తెలియడం లేదని ఆయన వాపోయారు. జగన్ నమ్ముకున్నది వారినే కాబట్టి, ఆయన ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజల వైపు నుంచి జగన్ ఆలోచించలేదు అనేందుకు ఆయన ఆవేదనే నిదర్శనం.
2019 ఎన్నికల సందర్భంలో నవరత్నాల పేరుతో జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. జగన్‌కు జనం పట్టం కట్టారు. నాడు టీడీపీ ఘోర పరాజయం మూటకట్టుకున్నదని అంతా అనుకున్నారు. కానీ నేడు అంతకు మించిన పరాజయం వైసీపీకి తప్పలేదు. అందుకే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం అని భావించొద్దు. ప్రజల నాడిని పసిగడుతూ అందుకు తగ్గట్టు నిర్ణయాలుంటాయి. కానీ జగన్ ఆ పని చేయలేకపోయారు. బహుశా ఆయన అతి విశ్వాసమే కొంప ముంచిందని చెప్పాలి.
2019లో జగన్ మేనిఫెస్టో తమకు భారీగా లబ్ధి కలిగిస్తుందని ప్రజలు నమ్మారు. అందుకే ఆదరించారు. అంతే తప్ప జగన్ మంచోడా, చెడ్డోడా అని ఆలోచించలేదు. అలాగే 2014లో చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహించారు. ఇవన్నీ జగన్‌కు నాటి ఎన్నికల్లో కలిసొచ్చాయి.
2024కు వచ్చే సరికి సూపర్ సిక్స్, ఇతరత్రా ఆకర్షణీయ పథకాల గురించి కూటమి, అనుకూల మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. జగన్ మాత్రం మళ్లీ తాను అధికారంలోకి వస్తున్నానని, అలివికాని హామీలు ఇవ్వలేనంటూ బడాయికి పోయారు. రైతు భరోసా కింద బాబు ఏడాదికి రూ.20 వేలు చెప్పగా, జగన్ మాత్రం రూ.16 వేలే అన్నారు. అలాగే పింఛన్‌ను రూ.4 వేలు ఇస్తానని బాబు హామీ ఇవ్వగా, అబ్బే నేను రూ.3,500 మాత్రమే ఇస్తాను, అది కూడా 2028, 2029 చివర్లో అంటూ చెప్పుకొచ్చారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్ ఇస్తానని బాబు అన్నారు. వికలాంగులకు రూ.6 వేలు ఇస్తానని బాబు హామీ ఇచ్చారు. జగన్ మాత్రం పాత పింఛన్‌నే ఇస్తానన్నారు.
మాట ఇస్తే, నిలబెట్టుకుంటాననే నమ్మకాన్ని తాను సంపాదించుకున్నానని, బాబుపై విశ్వసనీయత లేదని జగన్ భావించారు. విశ్వసనీయత, నమ్మకం, నిజాయితీ లాంటివన్నీ రాజకీయ నాయకుల నుంచి జనం ఎప్పుడు ఆశించరు. రేపటి సంగతి గురించి మాత్రమే ప్రజలు ఆలోచిస్తారు. చంద్రబాబు తమకు రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తానని చెబుతున్నారని, గతంలో జగన్‌కు ఇచ్చినట్టే, మరోసారి బాబుకు మరో అవకాశం ఇస్తే ఏమవుతుందని ప్రజలు ఆలోచించారు. చంద్రబాబు విశ్వసనీయతతో తమకేం పని అని అనుకున్నారు.అన్నింటికీ మించి ఆశ చెడ్డదని పెద్దలు ఊరికే చెప్పలేదు.
2014లో కూటమి మేనిఫెస్టో అమలు చేయలేదని, దాన్ని పట్టుకుని జగన్ ఊరూరా ప్రచారం చేసినా, జనం పట్టించుకోలేదు. జనం దృష్టి అంతా 2024 బాబు హామీలపైనే. జగన్ అధికారంలోకి వచ్చినా ఏడాదికి రూ.4 వేలు , అలాగే ప్రతినెలా రూ.1000 ఎందుకు పోగొట్టుకోవాలని రైతులు, పెన్షనర్లు ఆలోచించినట్టు… ఫలితాలను చూసి అర్థం చేసుకోవచ్చు. తాను గెలిచిపోయినట్టే జగన్ భావించి, బాబు -పవన్ మేనిఫెస్టోను అసలు పట్టించుకోలేదు. కానీ జనం మాత్రం ముందు చూపుతో… అంటే అధికారంలోకి ఎవరొస్తే, తమకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఆలోచించారు.
కూటమికి అధికారం దక్కింది. హామీలను అమలు చేస్తారా? లేదా? అనేది తర్వాత అంశం. 2029 ఎన్నికల నాటికి, ఏదో ఒకటి కొత్తగా ఆలోచించొచ్చని చంద్రబాబు ఊహించి వుంటారు. ఏం చేసినా, చేయకపోయినా తనను వెనకేసుకొచ్చే మీడియా అండ ఉందనే ధైర్యం చంద్రబాబుది. రాజకీయాల్లో జనం వైపు నుంచి ఆలోచించే నాయకులే నిలుస్తారు. తాను చెప్పింది మాత్రమే వినండి , అర్థం చేసుకోండి అంటే…అంత అవసరం తమకు లేదని ఓటు ద్వారా బుద్ధి చెబుతారు. జగన్ ఓటమి రాజకీయ నాయకులకు పెద్ద గుణపాఠం.