జగన్ మంత్రులదళంలో ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి!

ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండి పరిపాలన సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి నాయకుడు. ఆయన క్యాబినెట్ అనుచరుల దళంలో ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 25 మంది ఉన్నారు.…

ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండి పరిపాలన సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి నాయకుడు. ఆయన క్యాబినెట్ అనుచరుల దళంలో ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 25 మంది ఉన్నారు. ఈ పాతికమందిలో ఐదుగురికి ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అనే హోదా కూడా ఉంది. అంటే స్థూలంగా గమనించినప్పుడు ఒక ముఖ్యమంత్రి, అయిదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు, వీరు కాకుండా 20 మంది మంత్రులు ఉన్నారు.

ఎంతమంది ఉంటే మాత్రం ఏం లాభం? ఇప్పుడు ఎన్నికలలో జగన్ దళంలో ఒక్కరు తప్ప వారందరూ కూడా గల్లంతయ్యారు? జగన్ మంత్రివర్గంలో ఉంటూ ఈ ఎన్నికలలో గెలిచిన ఒకే ఒక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాదు, తంబళ్లపల్లె నుంచి తన సోదరుడు ద్వారకనాథరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అలాగే తన కొడుకు మిథున్ రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు. ఇంతటి ప్రతికూల పవనాలు వీచిన సమయంలో కూడా, మూడు స్థానాలలో తన కుటుంబ సభ్యులను గెలిపించుకోవడం ద్వారా పెద్దిరెడ్డి తన ప్రజాదరణను సాధికారంగా నిరూపించుకున్నారు.

సూటిగా చెప్పాలంటే ఇలాంటి ఫీట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా సాధ్యం కాలేదు. ఆయన టికెట్లు ఇచ్చిన వారిలో సొంత కుటుంబం నుంచి తమ్ముడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా గెలుపొందినప్పటికీ, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ప్రజలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మించుకున్న మంచి పేరు మాత్రమే ఇవాళ ఆయనకు అండగా ఉండి ఆయనను గెలిపించిందని వినిపిస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లా. పుంగనూరు నియోజకవర్గం లో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా బలమైన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారు. నారా చంద్రబాబు నాయుడుతో ఎస్వీ యూనివర్సిటీ రాజకీయాలలో సమఉజ్జీగా ఉంటూ అప్పటినుంచి ఆయనతో తలపడుతున్న తత్వం పెద్దిరెడ్డిది. క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో మమేకం అవుతూ ఆయన తన ప్రజాదరణను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చారు. నియోజకవర్గ ప్రజలు ఆయనను ప్రేమగా పెద్దాయన అని పిలుచుకుంటారు.

నియోజకవర్గంలో ఏ మారుమూల పల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పెద్దాయన తలుపు తడితే చాలు కష్టం తీరిపోతుంది అని నమ్మేంత స్థాయిలో ఆయన ప్రజాదరణ అక్కడ చలామణిలో ఉంటుంది. తనను కలవడానికి వచ్చిన ప్రతి వ్యక్తితోను పెద్దిరెడ్డి మాట్లాడతారు. వారి కష్టాలు విని, వాటిని పరిష్కరించడానికి అధికారుల్ని పురమాయిస్తారని పేరుంది. ఆయన చెంతకు వెళ్లే ప్రతి వ్యక్తితోనూ స్వయంగా మాట్లాడడం అనేదే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనల్పమైన బలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.