జగన్ చాతకానితనం!

అధికారంలో వున్నవారు అప్రమత్తంగా వుండాలి. చుట్టూ ఏం జరుగుతోందో గమనించుకోవాలి. ఈ విషయంలో వైఎస్ జగన్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. కేంద్రంతో తన సంబధాలను గుడ్డిగా నమ్మి, మిగిలినవి అన్నీ వదిలేసినట్లు కనిపిస్తోంది.…

అధికారంలో వున్నవారు అప్రమత్తంగా వుండాలి. చుట్టూ ఏం జరుగుతోందో గమనించుకోవాలి. ఈ విషయంలో వైఎస్ జగన్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. కేంద్రంతో తన సంబధాలను గుడ్డిగా నమ్మి, మిగిలినవి అన్నీ వదిలేసినట్లు కనిపిస్తోంది. కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు. బలమైన ఇంటిలిజెన్స్ వ్యవస్థ వుంటుంది. ఏం జరుగుతోందీ అన్నది తెలుసుకునే అవకాశం వుంటుంది. అదే విధంగా తమ పరిస్థితి ఎప్పటికప్పుడు ఎలా వుండబోతోందీ అన్నది తెలుస్తుంది.. తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

కేంద్ర భాజపా ఇదే చేసినట్లు కనిపిస్తోంది. ఆంధ్రలో కావచ్చు, బీహార్ లో కావచ్చు. ప్రజలు ఎవరికి అధికారం అందించబోతున్నారు అనే క్లారిటీకి వచ్చి వుంటుంది. అందుకే నితీష్ ను, చంద్రబాబు ను చాలా ప్లాన్డ్ గా దగ్గరకు తీసినట్లు కనిపిస్తోంది. భాజపా ఎప్పటికీ చంద్రబాబుకు దగ్గర కాదు, అదే విధంగా పవన్ కు చంద్రబాబుకు దగ్గర కానివ్వదు అనే గుడ్డి నమ్మకంతో వుండిపోయారు జగన్. అదే విధంగా రకరకాల కారణాలతో కేంద్రాన్ని తనకు అనుకూలంగా వుంచుకున్నాను కనుక, అదే రీతి కొనసాగుతుందనుకున్నారు.

కానీ రాజకీయాల్లో శాశ్వత అభిప్రాయాలు వుండవు. భాజపాకు జగన్ కన్నా కూడా అధికారం ముఖ్యం. అది ఎలా అందుతుంది అన్నది ముఖ్యం. జగన్ బలహీనపడుతున్నారు అని ముందే గమనించేసింది. అందుకే చంద్రబాబుకు దగ్గరయింది. చంద్రబాబుతో పొత్తుకు ముందుకు వచ్చినపుడే తెలుగుదేశం అనుకూలంగా వున్న వారంతా ఈ మాటనే ప్రచారం చేసారు. అయితే అది గాలిమాట గా తీసుకుని, జగన్ సైలంట్ గా నిమ్మకు నిరెత్తినట్లు కూర్చున్నారు.

హడావుడిగా ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి, విఫలయత్నంతో వెనక్కు వచ్చినుపుడయినా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అప్పుడు కూడా కదలలేదు. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తరవాత నితీష్, చంద్రబాబు పరిస్థితి, భాజపా పరిస్థితిని డీ కోడ్ చేసుకుంటే అర్థం అవుతుంది. ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం ఏమీ లేదు. కానీ భాజపా చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తూ, చూస్తూ కూడా చేతులు కట్టుకుని కూర్చోవడం అంటే అది జగన్ గొప్పతనమో, ధైర్యమో కాదు, చేతకానితనం.

భాజపాతో తాను ఎలాగూ కలవలేరు.తనకు తన మైనారిటీ ఓట్లు ముఖ్యం. కానీ అలా కలవను అనుకున్నపుడు, భాజపా తెలుగుదేశంలోకి వెళ్లకుండా తాను ఆపలేను అనుకున్నపుడు, అసలు భాజపా ఇప్పుడు ఎందుకు ఇలా మారింది… దాని వెనుక వైనం తెలుసుకునే ప్రయత్నం అన్నా చేసి వుండాలి కదా. అలా చేసి వుంటే, తన పార్టీ పరిస్థితి బాగా లేదు అని తెలిసి వచ్చేంది.

పైగా ఢిల్లీకి జగన్ కు అనుసంధానం అయినది ఎవరు? విజయసాయిరెడ్డి. ఆయనను ఆ పని మీద వుండనివ్వకుండా, నెల్లూరు వెళ్లమని ముందే పంపేసారు. ఇక ఢిల్లీలో ఏం జరుగుతోందో ఏలా తెలుస్తుంది.

ఇలా తన కళ్లకు తానే గంతలు కట్టేసుకుని కూర్చోవడం అంటే ఏమనాలి? కోరి ఓటమి కొనితెచ్చుకోవడం అని తప్ప?