దేశంలో పలు చోట్ల ఈసారి సినీ గ్లామర్ బాగా వర్కవుట్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ గెలిచినట్టుగానే, వివిధ ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పలువురు సినీ తారలు జెండా ఎగరేశారు. వీరిలో కంగనా రనౌత్, రాధిక లాంటి తారలున్నారు.
ఫ్రెష్ గా రాజకీయాల్లోకి వచ్చిన కంగనా రనౌత్, తొలి ప్రయత్నంలోనే ఎంపీ అయిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లోని తన సొంత ప్రాంతం మండీ నుంచి బీజేపీ తరఫున పోటీకి దిగిన కంగనా అనుకున్నది సాధించింది. ఏకంగా 74వేల మెజారిటీతో గెలిచింది.
ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రచన కూడా ఈసారి గెలుపొందారు. మమతా బెనర్జీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన రచన, హుగ్లీ నుంచి భారీ మెజారిటీతో గెలిచింది. ఎన్నికల టైమ్ లో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు మీమ్స్ గా మారాయి. అయితే అవే ఆమెను లైమ్ లైట్లో నిలబెట్టి విజయం వరకు తీసుకొచ్చాయి.
ఇక కేరళలోని త్రిసూర్ నుంచి సీనియర్ నటుడు సురేష్ గోపి (బీజేపీ) గెలుపొందగా.. బుల్లితెర రాముడిగా పేరు తెచ్చుకున్న అరుణ్ గోవిల్, బీజేపీ తరపున ఉత్తర ప్రదేశ్ మీరట్ నుంచి గెలుపొందారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన రవికిషన్ యూపీ లోని గోరఖ్ పూర్ నుంచి గెలిచారు. డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూడా మరోసారి గెలిచారు.
ఓడిపోయిన ప్రముఖుల్లో రాధిక ఉన్నారు. తమిళనాడు విరుదనగర్ లోక్ సభ సెగ్మెంట్ లో బీజేపీ తరఫున రంగంలోకి దిగిన రాధిక ఓడిపోయారు. ఈ టికెట్ కోసం ఆమె తన భర్త శరత్ కుమార్ పార్టీని సైతం బీజేపీలో విలీనం చేశారు. ఆ ప్రయత్నంతో పాటు, శరత్ కుమార్ గుడిలో చేసిన పొర్లు దండాలు రాధికను గెలిపించలేకపోయాయి.
ఇక నటి నవనీత్ కౌర్ కూడా ఓడిపోయారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ స్థానం నుంచి ఓడిపోయారు. అక్కడామె సిట్టింగ్ ఎంపీ. అటు కర్నాటకలోని శివమొగ్గలో శివరాజ్ కుమార్ భార్య గీత ఓడిపోయారు.