చంద్రబాబునాయుడు కొత్త ముఖ్యమంత్రిగా ఈనెల 9వ తేదీన పదవీ స్వీకార ప్రమాణం చేయబోతున్నారు. అసలే పొత్తుల్లో మూడు పార్టీలు ఉన్నాయి. అందరికీ మంత్రి పదవుల పంపకం అనేది తలనొప్పి కలిగించే వ్యవహారమే. ఇలాంటి సమయాలలో తలనొప్పిని తగ్గించుకునేందుకు ఏయే పార్టీకి ఎన్ని మంత్రిపదవులు ఇవ్వగలరో ఆ సంఖ్య మాత్రం చెప్పేసి, ఎవరెవరిని ఆ స్థానాల్లో ఉంచాలో ఆ పార్టీనుంచే ప్రతిపాదనలు తీసుకోవడం అనేది చంద్రబాబు అనుసరించదగిన ఉత్తమమైన మార్గం.
ఏపీ కేబినెట్ లో ముఖ్యమంత్రి కాకుండా 25 మందికి అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాల దామాషాలో గమనించినప్పుడు ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి దక్కుతుందని అనుకోవడం కూడా భ్రమ. అందుకే సాధారణంగా మంత్రి పదవులు కేటాయించే సందర్భాల్లో ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం అనేది ప్రాతిపదికగా చూస్తుంటారు. ఇదంతా పక్కన పెడితే.. తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ తమకు కనీసం 5 మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది.
5 మంత్రి పదవులు అనే సంఖ్య ఒక ఎత్తు అయితే.. అదే సమయంలో.. హోం మరియు ఇరిగేషన్ శాఖలు తమకు కావాలని పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ హోం మంత్రి మంత్రిత్వ శాఖ కోరుకుంటున్నారనే మాట పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గెలుపు తర్వాత మంగళగిరి చేరుకున్న పవన్ కల్యాణ్ అక్కడ మాట్లాడిన సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజలకు అద్భుతమైన శాంతి భద్రతలను అందిస్తామని మాట ఇచ్చారు. శాంతి భద్రతల విషయంలో జగన్ సర్కారు మీద నిందలు వేయడం, తమ ప్రభుత్వం వస్తే గొప్పగా చేస్తాం అని చెప్పడం.. పవన్ చాలాకాలంగా చేస్తున్నారు. ఈ మాటలన్నీ కూడా ఆయన హోంమంత్రిత్వ శాఖ తీసుకోవడానికి భూమిక మాత్రమేనని పలువురు అంచనా వేస్తున్నారు.
పవన్ కల్యాణ్ దాదాపుగా తన ప్రతి ప్రసంగంలో పోలీసుల మీద వల్లమాలిన ప్రేమ కురిపిస్తుంటారు. తన తండ్రి కూడా పోలీసు అని చెబుతుంటారు. వారి కష్టాలు తనకు తెలుసంటారు. ఒక ఎక్సయిజ్ కానిస్టేబుల్ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చి.. హోం మంత్రి అయితే ఆ మజా వేరుగా ఉంటుందనే ఉద్దేశంతో.. పవన్ ఆ శాఖనే కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
అలాగే ఎంతో కీలకమైన ఇరిగేషన్ శాఖను కూడా తమ శాఖకు తీసుకుంటే.. తమ పార్టీలోని నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ కు ఇవ్వవచ్చునని పవన్ యోచిస్తున్నట్టు సమాచారం.