ఏపీలో అరాచకం పోవాలంటే జగన్‌ను ఓడించాలని కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కూటమి ప్రచారాన్ని జనం నమ్మారు. జగన్‌ను ఇంటి బాట పట్టించారు. అయితే జగన్ ఏ పనైతే చేశారని ఇంతకాలం ఆరోపించారో, అదే కొనసాగిస్తే, దాన్ని ఏమనాలి? తాజాగా వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద టీడీపీ కార్యకర్త వ్యవహారం చూస్తే, మారింది ప్రభుత్వమే తప్ప, పద్ధతి కాదనే అభిప్రాయాన్ని కలిగిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
డాక్టర్ వైఎస్సార్ అనే పేరుతో ఉన్న పెద్దపెద్ద అక్షరాలను కాలితో తన్నుతూ, పైశాచికాన్ని ప్రదర్శిస్తున్న టీడీపీ కార్యకర్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారం వచ్చింది కదా అని ఏదైనా చేయొచ్చనే అహంకారం అప్పుడే కొంతమందిలో కనిపిస్తోంది. ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన వైసీపీ ఏమీ చేయలేకపోవచ్చు. అయితే సమాజం అంటే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కాదని తెలుసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై సొంత పార్టీ నేతలు సైతం తప్పు పట్టారు. ఏంటీ పిచ్చి చర్య అని తమలో తాము వైసీపీ నేతలు కూడా ఆవేదన చెందారు. ఎన్టీఆర్ పేరు తొలగించి, తన తండ్రి పేరు పెట్టడం మంచి సంప్రదాయం కాదని వైఎస్ షర్మిల గతంలో అన్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. తిరిగి ఎన్టీఆర్ పేరును వైద్య విశ్వవిద్యాలయానికి పెట్టుకోవచ్చు. అప్పుడు హుందాగా వుంటుంది.
కానీ, ఇప్పుడు అధికారం వచ్చిన తొలి రోజు నుంచే, తాము కూడా అదే పంథాలో నడుస్తామంటే అడ్డుకునే వారెవరూ ఉండరు. కాకపోతే, ఐదేళ్లకో సారి ప్రజాతీర్పునకు వెళ్లాల్సి వుంటుందనే స్పృహ ఉన్న వాళ్లెవరైనా జాగ్రత్తగా మసులుకుంటారు.