జగన్ ప్రశ్నలకి గ్రేటాంధ్రా జవాబులు

“సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర..లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా..భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా..  కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా..సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా..” Advertisement అంటూ చెరసాలలో భక్తరామదాసు దీనంగా పాడుకునే…

“సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర..లక్ష్మణునకు జేయిస్తి ముత్యాలపతకము రామచంద్రా..భరతునకు చేయిస్తి పచ్చలపతకము రామచంద్రా..  కలికితురాయి నీకు పొలుపుగ జేయిస్తి రామచంద్రా..సర్కారు పైకము తృణముగనెంచకు రామచంద్రా..”

అంటూ చెరసాలలో భక్తరామదాసు దీనంగా పాడుకునే పాట చాలమందికి తెలుసు. 

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిన తర్వాత మాట్లాడిన మాటలు వింటుంటే ఈ పాట గుర్తుకొచ్చింది..ఆయన మాటల్ని క్లుప్తంగా చెప్పుకోవాలంటే- 

“52 లక్షల మంది అక్కచెల్లమ్మలకి అమ్మ ఒడిని ఇచ్చాను-ఆ ఓట్లేమైనాయో..?

66 లక్షలమంది అవ్వాతాతలకు, వికలాంగులకు గతంలో చూడని మంచి చేసాం- వారి ఆప్యాయత ఏమయిందో…?

కోటి ఐదు లక్షల మంది అక్కచెల్లమ్మలకు చేయూత, సున్నావడ్డీ, ఆసరాలతో తోడుగా ఉన్నాం- ఆ ప్రేమ ఏమయిందో..?

పిల్లల చదువు కోసం ఎన్నో మార్పులు చేసి అండగా నిలిచాం- ఆ అభిమానం ఏమయిందో…?”

ఇలా సాగింది ఆయన ప్రసంగం. 

అక్కడ రామదాసు తన ఇష్టదైవమైన రాముడికి ఖర్చుపెట్టింది సర్కారు డబ్బే..ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి తాను నమ్ముకున్న ప్రజలకి ఇచ్చిందీ సర్కారు డబ్బే..

అంత చేసినా తనను చెరసాల పాలు చేసాడే రాముడు అని రామదాసు ఆక్రందన. ఇంత చేసినా తనను పదవీచ్యుతుడిని చేసారే ప్రజలు అని జగన్ మోహన్ రెడ్డి ఆవేదన. 

ఇక్కడ రామదాసుని, జగన్ మోహన్ రెడ్డితో పోల్చడంలేదు. విపరీతమైన విశ్వాసంతో కొన్ని పనులు చేసినప్పుడు ఊహించని ప్రతికూల ఫలితమొస్తే ఎలా ఉంటుందో ఒక పోలికతో చెప్పే ప్రయత్నమంతే. 

సరే..ఇంతకీ వైకాపా ఎందుకు ఓడింది? అనే ప్రశ్నకి ఆ పార్టీ మీద ద్వేషం ఉన్నవాళ్లు ఎన్నైనా చెప్పేయచ్చు. 

– జగన్ అభివృద్ధిని గాలొకొదిలేసాడు అనొచ్చు. 

– బాబాయి హత్య కారణమనొచ్చు. 

– చెల్లెలికి అన్యాయం చేసాడని వాదించొచ్చు. 

– చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకోవచ్చు. 

ఇవన్నీ వాళ్లు ఎప్పటి నుంచో చెబుతున్నవే. అయితే ఓటమికి ఇవి నిజంగా కారణాలో కాదో ఒక్కసారి ఆలోచిద్దాం. 

– అభివృద్ధి చూపించకపోవడమే కారణమనుకుంటే, మరి దానిని చూపించిన చంద్రబాబుని 2004లోనూ, 2009లోనూ, 2019లోనూ ప్రజలు ఎందుకు ఓడించారు?

– బాబాయి హత్య కారణమనుకుంటే, మరి కడపలో అవినాష్ రెడ్డిని ఎందుకు గెలిపించారు?

– చెల్లెలికి అన్యాయం చేస్తే మరి ప్రజలు ఆమెనెందుకు గెలిపించలేదు?

– చంద్రబాబుని జైల్లో పెట్టడం వల్ల అనుకుంటే, అసలాయన జైల్లో ఉన్నప్పుడు విదేశాల్లో కొందరు, రాష్ట్రంలో తెదేపా వర్గీయులు తప్ప మిగిలిన ప్రజలు ఎందుకు నిరసనలు చేయలేదు?

కనుక ఇవేవీ అసలు కారణాలు కాదు. వైకాపా మీద పెంచుకున్న అయిష్టత వల్ల, తెదేపా మీద ఇష్టం వల్ల కొందరికి గబుక్కుని ఈ కారణాలు స్ఫురిస్తాయంతే. 

మరి అసలు కారణాలు ఏమయుండొచ్చు? 

“చంద్రబాబు సంక్షేమం విషయంలో వాగ్దానాలు నిలబెట్టుకోలేదు కాబట్టి 2019లో ఓడించారు. కానీ తాము చేసిన వాగ్దానాల్లో ఒక్క మద్యనిషేధం తప్ప దాదాపు అన్నీ నిలబెట్టుకున్నాం కదా..అయినా ఈ ఓటమేమిటి?” అనేది వైకాపా శ్రేణుల్ని తొలిచేస్తున్న ప్రశ్న. 

“ఏ కారణాల చేత ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా మరీ ఈ స్థాయిలో 11 సీట్లకి పరిమితం చేయడమేంటి?” అనేది వారికి మింగలేని చేదు గుళిక. 

ఈ ప్రశ్న నుంచే సమాధానం ఆలోచించుకోవాలి. 

సంక్షేమం ఒక్కటీ రాజ్యాధికారం పొందడానికి సరిపోదనేది ఒక సత్యం. 

ఎందుకంటే, నిజానికి ఈ స్థాయి లక్షల కోట్ల పంచుడు కార్యక్రమం గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఇంతకంటే సంక్షేమం చేయడానికి ఏదీ లేదు అన్నట్టుగా ఉంది. అయినా ఈ స్థాయిలో ఓటమి పలకరించింది. 

అంటే సంక్షేమం ఒక్కటే కాదు..అభివృద్ధి కూడా తోడవ్వాలి. 

“ఇన్నేసి పోర్టులు కట్టాం, మెడికల్ కాలేజీలు తెరుస్తున్నాం, స్కూళ్లు పునరుద్ధరించాం..ఇది అభివృద్ధి కాదా!!?: అని అడగడం కరెక్టే. కానీ జనం కోరుకునే అభివృద్ధి అదొక్కటే కాకపోవచ్చు. 

రియలెస్టేట్ బూం వస్తే ప్రైవేట్ నిర్మాణాలు మొదలవుతాయి. అప్పుడు చేతినిండా పని ఉంటుంది. రోజు వారీ కూలీల నుంచి, చిన్న స్థాయి సివిల్ ఇంజనీర్ల నుంచి, కాంట్రాక్టర్ల వరకు అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. అది జరిగేలా చూడాలి. అంతే తప్ప పోర్టులు కట్టాక అందులో ఉద్యోగాలిస్తాం, అంతవరకు ఆగమన్నా, అందాకా ఈ పోర్టుల్లో నిర్మాణ పనులు చేసుకోండి, ప్రభుత్వం వేతనమిస్తుంది..అని అన్నా అది సరిపోదు. ప్రతీదీ ప్రభుత్వం సీటు కింది పెట్టుకుని పనికి పిలిస్తే అది అభివృద్ధిలాగ అనిపించదు ప్రజలకి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పనులు కల్పించే శక్తి వెళ్లాలి. అది రియల్ బూముతో సాధ్యం. ఆ పని గత ఐదేళ్లల్లో ఎక్కడా జగరగలేదు. కనుక ఎంత లిస్టు చదివినా ఆ అభివృద్ధి జనం జీవితాలపై ప్రభావం చూపలేదు. 

అదలా ఉంటే వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది రెండు విషయాల్లో. 

ఒకటి- చేస్తున్న సంక్షేమాన్ని అతిగా ప్రచారం చేసుకోవడం;

రెండు- తెచ్చిన పరిశ్రమల వివరాల్ని గట్టిగా చెప్పుకోకపోవడం. 

ఆటో డ్రైవర్లకి 15000 రూపాయలు ఇచ్చామని యాడ్ వేస్తే ఇతర ప్రజలకి ఆనందమా?

అవ్వాతాతలకి ఇంత డబ్బు బటన్ నొక్కి ఇచ్చాను అని ప్రకటన వేస్తే..మిగిలిన ప్రజలు ఆనందబాష్పాలు కారుస్తారా? 

సంక్షేమం గురించి ఇచ్చినవాడికి, పుచ్చుకున్నవాడికి తెలిస్తే చాలు. 

పరిశ్రమలు ఎక్కడ ఏమొస్తున్నాయి అనే విషయాలు అందరికీ తెలియాలి. ఏ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయి, తమ ప్రాంతంలో ఎన్నొస్తున్నాయి అని జనం తెలుసుకుంటారు. రియాల్టర్లు రియల్ బూం ఆటోమేటిక్ గా తెస్తారు. దాంతో ప్లాట్లు రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. పనులు మొదలయ్యి పైన చెప్పుకున్నవి జరుగుతాయి. అసలీ దిశగా ఎవ్వరూ సలహా ఐవ్వకపోయి ఉండొచ్చు..ఇచ్చినా అయ్యవారు పట్టించుకోకపోయి ఉండొచ్చు. లేకపోతే జరిగేదే కదా! 

సరే ఇంతకీ అభివృద్ధి చేసిన చంద్రబాబుని గతంలో ఓడించారు, సంక్షేమం చేసిన జగన్ ని కూడా ఓడించారు…మరేం చెయ్యాలి? అనే ప్రశ్నకి ఉన్నంతలో ఒక్కరే జవాబుగా కనిపిస్తున్నారు. ఆయనే వై.ఎస్.ఆర్. 

తన తండ్రికంటే గొప్పగా సంక్షేమం చేసానని జగన్ అనుకుని ఉండొచ్చు. ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన అనుచరులు మాత్రం అంటూ ఉంటారు. కానీ జగన్ తన తండ్రి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. 

1. సంక్షేమం, అభివృద్ధి- రెండింటినీ బ్యాలెన్స్ చేయడం. 

2. అగ్రకులాలు, ఇతర కులాలు అనే తేడా లేకుండా అందరి మనసుని గెలుచుకునేలా వ్యవహరించడం

3. రాజకీయంగా వెన్నుదన్నుగా ఉండే సొంత వర్గానికి చెందిన రాజకీయనాయకులు, ఎన్నారైలు, హై నెట్ వర్త్ పీపుల్..ఇలా అందరినీ దగ్గరగా పెట్టుకోవడం. 

4. రాజకీయ ప్రత్యర్ధులతో ఛలోక్తులు, సున్నితమైన సెటైర్లు తప్ప కఠిన మాటలతో బాధపెట్టకుండా ఉండడం. ఒకవేళ అలా సొంత పార్టీ వాళ్లు ఎవరైనా వ్యవహరిస్తే వారిని మందలించడం.

5. వయసుకి గౌరవమిస్తూ రాజకీయ ప్రత్యర్థులని సంబోధించడం. 

నిజానికి చంద్రబాబు, వైఎస్సార్ ఇద్దరూ సఖ్యంగానే ఉండేవారు. ఒకే ఒక్కసారి తన పాలనపై తెదేపా చేస్తున్న ఏదో దుష్ప్రచారాన్ని తిప్పిగొడుతూ, “ఇలాంటి పనులు చేస్తున్న నిన్ను ఎందుకు కన్నానా అని నీ తల్లి కూడా బాధపడుతుందయ్యా చంద్రబాబు..” అని అన్నారు వైఎస్సార్. అదే ఆయన నోరు జారి అన్న అతి పెద్ద మాట. అది అప్పట్లో పెద్ద వార్తయింది. 

కానీ జగన్ మోహన్ రెడ్డి పాలనలో చంద్రబాబు పడిన మాటలు గుర్తు తెచ్చుకుంటే అసలు వైఎస్సార్ అన్నది పెద్ద విషయంగానే అనిపించదు. ఆ స్థాయిలో దుర్భాషలాడారు వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు. దేనికి గౌరవమిచ్చినా ఇవ్వకపోయినా వయసుకైతే ఇవ్వాలి. ఆ విషయంలో పూర్తిగా గాడి తప్పి ప్రజల్లోని ఒక వర్గం ఓటర్ల క్రోధానికి కారణమయ్యారు. ముఖ్యంగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వర్గాల్లో ఈ కంప్లైంట్ బలంగా వినిపిస్తూ వచ్చేది. 

వైఎస్సార్ విషయంలో సంక్షేమం అనగానే గుర్తుకొచ్చేది “ఆరోగ్యశ్రీ”. ఆయన ఎన్నో స్కీములు పెట్టినా ఇది మాత్రం కలికితురాయి. ఎందుకంటే ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తికి భయం గొలిపే విషయం “ఏదైనా వస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలి? ఖర్చు ఎంతవుతుంది?”. ఆ భయాన్ని పూర్తిగా చెరిపేసిన స్కీం ఆరోగ్యశ్రీ. వైఎస్సార్ ఎందరికో దేవుడైపోయింది కూడా ఈ ఒక్క విషయం వల్లే. 

కటిక పేదలే కాకుండా, మధ్యతరగతి, కాస్తంత ఎగువ మధ్యతరగత వర్గానికి కూడా ఈ స్కీం వర్తించడం వల్ల ఓటు బ్యాంకు విస్తృతంగా పెంచుకున్నాడాయన. పైగా ఇది కులాలకి అతీతమైన స్కీం. ప్రతి ఇంట్లోనూ తనకో, భార్యకో, పిల్లలకో, వృద్ధులకో ఉపయోగపడే స్కీము. కనుక ఎమోషనల్ కోషెంట్ చాలా బలంగా ఉండే పథకం “ఆరోగ్యశ్రీ”. 

అంతటి ఏమోషనల్ కోషెంట్ ఉన్న స్కీము జగన్ ప్రభుత్వంలో ఏది ఉంది? 

అమ్మ ఒడి పేరుతోనో, పెన్షన్ పేరుతోనో….పేరు ఏదైనా కావొచ్చు..జగన్ ఇచ్చింది డబ్బు. ఈ డబ్బు ఎంత పంచినా అవసరం తీరుతుందేమో తప్ప ఎమోషన్ ని టచ్ చెయ్యదు. ఇది కాస్త నిశితంగా పరిశీలిస్తే తెలిసే అంశం. 

ఉదాహరణకి ఒక తెలిసిన వ్యక్తి ఉద్యోగం లేక కొన్నేళ్లుగా కష్టపడుతున్నాడనుకోండి. అతనికి మీరు పని కల్పించి నెలకి 15000 ఇస్తున్నారనుకోండి. మొదటి ఏడాది మీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉంటాడు. తర్వాత జీతం కాస్త పెంచితే బాగుండనుకుంటాడు. పెంచాక మరొక ఏడాది ఓకే. ఈ లోగా వేరే వ్యక్తి వచ్చి 40000 ఇస్తా అంటే ఇతను వెళ్లిపోతాడా లేక మొదటి సారి పిలిచి కొలువిచ్చిన వ్యక్తి దగ్గరే తక్కువ జీతమైనా ఉండిపోతానంటాడా? కచ్చితంగా వెళ్లిపోతాడు. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలైనా అంతే. ఎంతమంది మొదటి కంపెనీతోనే ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి అక్కడే రిటైరవుతున్నారు? కనుక పని చేసైనా, చేయకుండా అయినా డబ్బు తీసుకునే విషయంలో కృతజ్ఞత తక్కువుంటుంది. సంతృప్తి కూడా తాత్కాలికం. అంతకంటే మెరుగైన డబ్బొస్తే జంప్ కొట్టడం సహజం. 

ఇక్కడ అదే జరిగుండొచ్చు… 

జగన్ “అమ్మ ఒడి” ఒక్క బిడ్డకే ఇస్తుంటే, చంద్రబాబు ఎంతమందుంటే అంతమందికీ రూ 15000 చొప్పున ఇస్తానన్నాడు. సహజంగా ముగ్గురు పిల్లలున్న తల్లులకి ఆశ కలుగుతుంది. ఎక్కడ రూ 15000? ఎక్కడ రూ 45000? 

అలాగే పెన్షన్ కూడా..పదవిలోకి రాగానే 4000 ఇస్తానన్నాడు బాబు. పైగా 50 ఏళ్ల వయసు నుంచే ఒక వర్గానికి పెన్షన్ ఇస్తానన్నాడు. అలా ఆయా వర్గాలన్నింటినీ తన అనుభవంతో బుట్టలో వేసేసుకున్నాడు. 

కానీ వైకాపా శ్రేణులు అనుకున్నది వేరు…గతంలో చేసిన వాగ్దానాలని నిలబెట్టుకోని చంద్రబాబుని జనం నమ్మరనుకున్నారు. కానీ వాళ్లకి తెలియని విషయమేంటంటే..అసలు జనంలో అధిక సంఖ్యాకులకి గతం గుర్తుండదని, వర్తమానంలో కనిపిస్తున్న ఆశ వెనుకే పరుగెడతారని..! 

అదే చంద్రబాబు అనుభవానికి, జగన్ అనుభవరాహిత్యానికి నిదర్శనం. 

ఇంకేముంది? ఏ మహిళా ఓటర్లనైతే నమ్ముకున్నాడో వాళ్లంతా తమ ఒక్కో సంతానంలోనూ ఒక్కో రూ 15000 ని చూస్తూ కూటమికి ఓట్లు గుద్దేశారు. 

50 ఏళ్లు దాటిన మగవాళ్లు పెన్షన్ రూపంలో రాబోతున్న పాకెట్ మనీని ఊహించుకుని కూటమికి బటన్ ఒత్తేసారు. 

అక్కడే ఆట అయిపోయింది.  

జగన్ ఏ ఓటర్లని చూసి ధైర్యంగా ఉన్నాడో ఆ ఓటర్లపై సమ్మోహనాస్త్రం వేసి పడగొట్టేసాడు బాబు. వాళ్లు పడిపోతారన్న సంగతి తెలుసుకోలేకపోవడం జగన్ అనుభవరాహిత్యమంతే.  

అక్కడికీ కొందరు సలహాదారులు ఆయనకి ఋణమాఫీని ప్రకటించమని, చంద్రబాబు సమ్మోహనాస్త్రాల్ని తట్టుకోవడానికి ఆ మాత్రమన్నా చెప్పాలని సూచించారు. కానీ జగన్ ఒప్పుకోలేదు. “చెప్పాడంటే చేస్తాడంతే” అనే ఇమేజుని నిలబెట్టుకోవాలంటే సాధ్యం కాని వాగ్దానాలు చేయనని భీష్మించుకుని కూర్చున్నాడు. ఆ మొండితనం కూడా ప్రస్తుత ఫలితానికి కారణం. 

ఇక్కడ జగన్ అయినా, ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిన విషయం ఒకటుంది. వాగ్దానాల విషయంలో అబద్ధాలు చెప్పకూడదనుకుంటే..మరీ సత్యహరిశ్చంద్రుడిలా కాకుండా కనీసం ధర్మరాజులాగ “అశ్వథ్థామ హతః ..కుంజరః” అనడమైనా నేర్చుకోవాలి. అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నది. ముందు వాగ్దానాలన్నీ గట్టిగా చెప్పేయడం, గెలిచిన తర్వాత “కండిషన్స్ అప్లై” అని చెప్పి కొందరికే పంచడం. అదీ ప్రస్తుత రాజకీయాల్లో లేటెస్ట్ డెవెలప్మెంట్. 

ఇక మరొక విషయం- జగన్ ఎంతసేపూ “నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు…” అని పదే పదే చెప్పడం వల్ల తక్కిన కులాల వాళ్లంతా మానసికంగా జగన్ కి దూరం జరుగుతూ వెళ్లినట్టయ్యింది. అధిక సంఖ్యలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు మాత్రమే కాకుండా రెడ్డి సమాజికవర్గం వారు కూడా జగన్ ని ఎమోషనల్ గా తీసుకోలేదు. ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే 2019లో జగన్ గెలుపు కోసం ముందు వెనుక ఆలోచించకుండా లక్షలు, కోట్లు ఖర్చుపెట్టిన ఎన్నారై రెడ్లు, వ్యాపారాలు చేసుకునే రెడ్లు, 2024 లో జగన్ గెలిచినా ఓడినా సంబంధం లేదన్నట్టున్నారు. దానికి కారణం వాళ్లకి కనీసం ఆపాయింట్మెంట్ ఇచ్చి ఫోటొ దిగే అవకాశం కూడా కలగలేదట. 

ఈ కోవలో సోషల్ మీడియా యోధులు కూడా ఉన్నారు. తన వైపు నిలిచి రకరకాల కేసులు అవీ ఫేస్ చేసిన ఆ యువకులకి ఎటువంటి భరోసా ఇవ్వలేదు జగన్. తర్వాత చాలామందికి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు కలవడానికి. దానికి ప్రధాన కారణం జగన్ తన చుట్టూ పెట్టుకున్న కొందరు అడ్వైజర్లు, వ్యక్తిగత సిబ్బంది. 

ఎవరికి అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు జగన్ కి దగ్గరైపోతారో అని వీళ్ల ఇన్సెక్యూరిటీతో వాళ్లని దూరం పెడుతూ వచ్చారు. 

వాళ్లంతా జగన్ ని దూరం పెడుతూ వచచరు. 

చివరకి జగన్ కి ఆ పక్కనున్న వాళ్లే మిగిలారు. ఇది కూడా అనుభవరాహిత్యం వల్ల చేసుకున్న స్వయంకృతాపరాధమే. 

ఎందుకు ఓడిపోయారో చేసుకునే సమీక్షలో ఇవన్నీ కూడా ప్రస్తావించుకోవాలి. అన్నట్టు ఇక్కడొక మాట. 

జగన్ మీద ప్రేమున్నా, నిలబడిన అభ్యర్థుల మీద వ్యతిరేకత వల్ల జనం ఓట్లేయలేదు అని ఒక వాదన ఉంది. కానీ అది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే పనిమంతుడైన ఎమ్మెల్యే అని ప్రత్యర్థులు కూడా ఒప్పుకునే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. యూట్యూబులో ఆయన వీడియోలకి తెలంగాణాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. “ఎమ్మెల్యే అంటే ఇలా పని చేయాలి” అనేట్టుగా చేసాడాయన. తాని రోజూ మార్ణింగ్ వాక్ పేరుతో ప్రతి వీధిలోనూ తిరిగి సమస్యలు తెలుసుకోవడం, కొన్ని స్పాట్లో పరిష్కరించడం..ఇలా ఎన్నో వీడియోలుగా అప్లోడ్ చేస్తూ వచ్చాడు కూడా. అయినా ఓడిపోయాడు. పైగా ఆయన ఓడిపోయింది స్థానిక ఓటర్లకి ఎవరో తెలియని నాన్ లోకల్ అయిన సత్యకుమార్ మీద. 

కనుక సమస్య అభ్యర్థులు కాదు..

సమస్యల్లా పైన చెప్పుకున్నట్టు చంద్రబాబు సమ్మోహనాస్త్రాలు..,

నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయను అని జగన్ మోహన్ రెడ్డి ఓవర్ సెంటిమెంటల్ నిర్ణయాలు..,

సొంత వర్గాన్ని, సోషల్ మీడియా యోధుల్ని, అగ్రకుల ఓటర్స్ ని దూరం చెసుకోవడం..,

తన తండ్రి వైఎస్సార్ ఆరోగ్యశ్రీతో మధ్యతరగతి ఓటర్ల మనసు గెలుచుకున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ఏ స్కీముతోనూ ఆ వర్గాన్ని గెలుచుకోలేకపోవడం.

ఓటమికి ప్రధాన కారణాలు ఇవే అవ్వాలి. వీటి తర్వాతే ఏమైనా! 

శ్రీనివాసమూర్తి