దేశంలో బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరం అయిన మెజార్టీ దక్కలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు. అది నిస్సందేహంగా మోడీ ఫెయిల్యూర్ అని ఆయన విమర్శించారు. అదే బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన ఈ అవకాశాన్ని పూర్తిగా వాడుకుని ఏపీకి ప్రత్యేక హోదా విశాఖకు రైల్వే జోన్ తో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ రోజున మోడీ ఏపీ మీద పూర్తిగా ఆధారపడ్డారని ఆయన గుర్తు చేశారు. దీనిని తెలివిగా వ్యూహాత్మకంగా వాడుకోవాలని ఆయన కోరారు. పోలవరం పూర్తికి కేంద్రం చర్యలు తీసుకునేలా చేయాలని ఆయన కోరారు. నరేంద్ర మోడీ అమిత్ షాల అహంకార పూర్తీమైన వైఖరికే జనాలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. తాను దైవాంశ సంభూతుడనని మోడీ భావించారని ప్రజల మధ్యన బీజేపీ అగ్ర నేతలు ఎన్నో వైషమ్యాలను పెట్టి లబ్ది పొందాలని చూసినా వీలు కాలేదని అన్నారు.
ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ తన భాగస్వాములకు మరిన్ని సీట్లు ఇచ్చి సర్దుబాటు చేసుకుని ఉంటే అధికారంలోకి ఈసారి వచ్చేదని ఆయన అన్నారు. ఈసారి కేంద్రంలో బలమైన ప్రతిపక్షం వచ్చిందని అది ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు చేస్తుందని కామ్రెడ్ వ్యాఖ్యానించారు.