ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఆ పార్టీ ఎపుడూ తక్కువ సీట్లు తెచ్చుకోలేదు. ఓడినా గౌరవప్రదమైన సీట్లే జనాలు ఇచ్చారు. కానీ చరిత్రలో తొలిసారి 2019లో మాత్రం టీడీపీని కిందకు దించేసి వైసీపీని పూర్తిగా సమాదరించారు. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో ఆరు తప్ప అన్ని సీట్లూ ఫ్యాన్ పార్టీకి ఇచ్చి పట్టం కట్టారు. ఎనభై అయిదు శాతం పైగా సీట్లు వైసీపీకి దక్కించి ఎక్కడో కూర్చోబెట్టారు.
అయిదేళ్ళు క్యాలెండర్ లో తిరిగేసరికి అదే వైసీపీని నేలకి దించారు. ఉత్తరాంధ్ర రాజకీయ చిత్రపటంలో వైసీపీ ఎక్కడా అని చూసుకునే పరిస్థితి ఇపుడు ఏర్పడింది. శ్రీకాకుళం దాటుకుని విజయనగరం నుంచి ముందుకెళ్ళి విశాఖ అంతా అర్బన్ రూరల్ చూసినా ఎక్కడా ఫ్యాన్ పార్టీ జాడ కాన రాని దుస్థితి ఈసారి ఎన్నికల్లో కనిపించింది.
వైసీపీకి పరువు నిలిపింది మాత్రం ఉమ్మడి విశాఖ ఏజెన్సీలోని రెండు సీట్లే. అలాగే అరకు పార్లమెంట్ సీటు. ఈ మూడింటా హ్యాట్రిక్ కొట్టి వైసీపీ తాను ఉన్నాను అనిపించుకుంది. లేకపోతే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసేది.
ఉత్తరాంధ్రలో ఆరు ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే అందులో మెజారిటీ కూటమి పరం అయ్యాయి. కానీ ఎంపీ సీటు మాత్రం వైసీపీకి దక్కింది. దానికి అరకు పాడేరు అసెంబ్లీలలో వచ్చిన మెజారిటీలు కారణంగా చెబుతున్నారు. వైసీపీ తన తలరాతను మార్చుకోవడానికి ఏజెన్సీ నుంచే ఉత్తరాంధ్ర వైపుగా మరోసారి కఠినమైన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాల్సి ఉంది.