పవన్ దేన్నైతే నమ్మాడో.. ‘100%’ పనిచేసింది!

జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ఒక అపురూపమైన విజయాన్ని నమోదు చేశారు. పోటీచేసిన అన్ని స్థానాలతో జనసేన పార్టీని విజయపథంలో నడిపించారు. ఒక ప్రాంతీయ పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ.. అంటే, 21…

జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో ఒక అపురూపమైన విజయాన్ని నమోదు చేశారు. పోటీచేసిన అన్ని స్థానాలతో జనసేన పార్టీని విజయపథంలో నడిపించారు. ఒక ప్రాంతీయ పార్టీ పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ.. అంటే, 21 అసెంబ్లీలకు గాను 21లోను, 2 ఎంపీసీట్లకు గాను, 2లోనూ గెలవడం అనేది ఎన్నడూ జరిగిన ఘటన కాదు. ఆ మేరకు పవన్ రికార్డు సృష్టించినట్టే. అయితే ఈ అరుదైన ఫీట్ ఆయనకు ఎలా సాధ్యమైంది?

లోతుగా పరిశీలించినప్పుడు పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా పావులు కదిపినట్టు అనిపిస్తోంది. ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి, అసెంబ్లీలో అడుగుపెట్టడానికి, పార్టీ తరఫున విజయాలు నమోదు చేయడానికి ఆయన ఏ మార్గాన్నయితే ఎంచుకున్నారో అది వంద శాతం పనిచేసింది. కాబట్టే వంద శాతం విజయాలు దక్కాయి.

ఇంతకూ ఆయన నమ్ముకున్నది ఏమిటా అనుకుంటున్నారు కదా.. అదే కాపు, బలిజ కులం ఓట్లు. పవన్ కల్యాణ్ 2019 పరాభవాన్ని కూడా రాష్ట్రంలోని కాపువర్గం తమకు పరాభవంగా భావించింది. ఈసారి ఆయన కాపు వర్గాన్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఎన్నికలకు ముందు జాగ్రత్తగా బోలెడు సర్వేలు చేయించుకున్నారు. కాపు మనోగతం తెలుసుకున్నారు. నియోజకవర్గాల వారీగా కాపు సంఖ్యా బలం కూడా తెలుసుకున్నారు.

చాలా స్పష్టతతో కాపు కులం ఓట్లు ఎక్కడెక్కడైతే మెజారిటీ ఉన్నాయో అలాంటి నియోజకవర్గాలను మాత్రమే సెలక్టు చేసుకున్నారు. తెలుగుదేశం సిటింగ్ స్థానాలా? కాదా? అనే ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా ఆ సీట్లన్నీ తనకు కావాలని పట్టుబట్టి తీసుకున్నారు. సహజంగానే కాపు ఓటు బ్యాంకు ఐక్యంగా ఆయనకు పనిచేసింది. పలుచోట్ల వైసీపీ కూడా కాపు వర్గం వారినే మోహరించినా జనం పట్టించుకోలేదు. కాపు అంటే పవన్ మాత్రమే అన్నట్టుగా ఓట్లు వేశారు. కాపు కులం ఓటు బ్యాంకుకు… ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి ఉండే కొద్ది ఓట్లు కూడా జతకావడంతో ఇలాంటి అపురూపమైన విజయాలు దక్కాయి.

ఎప్పుడూ కులాల గురించి మాట్లాడుతూ.. అన్ని కులాలకూ అధికారం దక్కాలనే సిద్ధాంతం చెబుతూ ఉండే పవన్ కల్యాణ్.. కేవలం తన కులాన్ని నమ్ముకుని మాత్రమే.. కులం ఓట్లు వేయించుకుని మాత్రమే ఇప్పుడు అసెంబ్లీలోకి ప్రవేశిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు.