ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకరరెడ్డి రాజీనామా చేశారు. గత ఏడాది ఆగస్టులో రెండో దఫా టీటీడీ చైర్మన్‌గా భూమన బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు పదవిలో ఉండేలా జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూమన పదవి నుంచి వైదొలిగారు.
గతంలో వైఎస్సార్ హయాంలో భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా పని చేశారు. అప్పట్లో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చిన్నపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం, శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండానే అన్నప్రసాదం స్వీకరించడం లాంటివి ఆయన హయాంలోనే ప్రవేశ పెట్టారు. దళిత గోవిందం ఆయన హయాంలోనే జరిగింది. గిరిజనులకు అర్చకత్వంలో శిక్షణ ఇప్పించారు. ఇలా అనేక మంచి కార్యక్రమాలు చేశారు.
రెండోసారి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గోవిందకోటి రాసిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు వేతనాల పెంపు, ఇంటి స్థలాల పంపిణీ చేపట్టారు. రెండో దఫా టీటీడీ చైర్మన్‌గా బాధ్యతల్ని తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటమితో అర్ధంతారంగా ఆయన వైదొలగాల్సి వచ్చింది. భూమన లాగే నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు… తమ పదవులకు రాజీనామా చేయనున్నారు.