ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమి విజయం దిశగా పయనిస్తున్నారు. కూటమి పార్టీలు మూడూ కలిసి.. మంచి మెజారిటీ స్థానాలను సాధిస్తున్నాయి. ఏకంగా 150 పైచిలుకు స్థానాలతో కూటమి అధికారంలోకి రాబోతున్నది.
ఒక్క విషయంలో చంద్రబాబునాయుడు వ్యూహం, పవన్ కల్యాణ్ పడిన కష్టం విజయవంతం అయ్యాయి. మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ చాలా పద్ధతిగా జరిగినట్టుగా ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. కేవలం తెలుగుదేశం మాత్రమే కాకుండా, భాజపా, జనసేన కూడా తాము పోటీచేస్తున్న స్థానాల్లో గెలుపుబాటలోనే ఉన్నారు.
మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ అనేది చాలా సక్సెస్ ఫుల్ గా జరిగింది. కూటమి రాజకీయాల్లో ఇది అనూహ్యమైన పరిణామం. నిజానికి పొత్తులు కుదరడం అనే పరిణామమే అనూహ్యంగా జరిగింది. పవన్ కల్యాణ్ తొలినుంచి పొత్తులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ.. భాజపా కూడా ఆ జట్టులోకి రావడం సాధ్యమవుతుందని చాలా మంది ఊహించలేదు.
మోడీ పట్ల గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఎంత దారుణంగా మాట్లాడుతూ వచ్చారో.. ఆ దెబ్బకు జీవితంలో మోడీ మళ్లీ ఆయనతో జతకట్టే పరిస్థితి లేదని అంతా అనుకున్నారు.
పవన్ కల్యాణ్ మాటలు కూడా అలాగే కనిపించాయి. చాలా తిట్లు తిని, అందరి కాళ్లు పట్టుకుని పొత్తులు కుదిరేలా చేశానని పవన్ చెప్పుకున్నారు. పొత్తులు కుదిరినప్పటికీ.. ఈ పార్టీల మధ్య ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అనుమానం అందరికీ ఉంది. భాజపా నాయకులు చాలా మంది పొత్తుల్ని వ్యతిరేకించారు. రామాలయం తర్వాత రాష్ట్రంలో కూడా మోడీ హవా పెరిగినప్పటికీ.. ఆ ఓట్లన్నీ తెలుగుదేశానికి పడడం అనుమానమే అనిపించింది. అలాగే తెలుగుదేశం నాయకులు కమలానికి ఓట్లు వేయిస్తారా లేదా? అనేది కూడా డౌటుగానే సాగింది.
కానీ.. ఈ మూడు పార్టీల నాయకులు ఓటు బదిలీ సక్రమంగా జరిగేలా తమ తమ స్థానిక నేతల్ని ఒప్పించారు. కేవలం ఓటుబదిలీ అంతా పద్ధతిగా జరగడం వల్ల మాత్రమే.. కూటమి మొత్తానికి లాభం జరిగింది. ఆ మూడు పార్టీలు కూడా ఘనవిజయాల్ని నమోదు చేశాయి. కూటమి అధికారంలోకి వస్తోంది. చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు.