ఏపీలో కూటమి సునామీ సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నేతల అంచనాకు అందని రీతిలో ప్రజలు విజయాన్ని అందిస్తున్నారు. జిల్లాలకు జిల్లాలే కూటమి వశం అవుతున్నాయి. ఏ జిల్లా చూసినా కూటమి అభ్యర్థులు విజయ పథంలో సాగుతున్నారు.
ప్రస్తుతానికి వైసీపీ కేవలం 17 అసెంబ్లీ, 3 లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ముందంజలో వుంది. కూటమి మొత్తం 158 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాల్లో దూసుకుపోతోంది. గత ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ, 23 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడా సంఖ్యను మించేలా టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయ పథంలో ముందుకు సాగుతోంది.
ఈ ఫలితాలను కూటమి నేతలు సైతం ఊహించలేకపోయారు. వైసీపీ పాలనపై ప్రజలు ఎంత కసిగా ఉన్నారో ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కట్టుగా పోటీ చేశాయి. కూటమి నేతల వ్యూహాలు సత్ఫలితాలు ఇచ్చాయి.
ఇదిలా వుండగా వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు గాలి వీచింది. మరీ ముఖ్యంగా వైసీపీకి పట్టున్న రాయలసీమలో కూడా ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లా కడపలో కూడా వైసీపీకి ప్రతికూల ఫలితాలే రావడం గమనార్హం.
కేవలం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు ప్రస్తుతానికి ముందంజలో ఉన్నారు. ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు మినహా, ఎక్కడా వైసీపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. కొన్ని చోట్ల వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి.