ఏపీలో అధికారం ఎవరిని వరిస్తుంది?…ఇదీ గత కొన్ని నెలలుగా మనసుల్ని తొలుస్తున్న ప్రశ్న. దానికి సమాధానం ఇవాళ రానుంది. ఎన్నికలంటే ఎప్పుడూ యుద్ధాన్ని తలపిస్తుంటాయి. ఈ దఫా ఎన్నికలు కాసింత ఎక్కువ వేడి పుట్టించాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యర్థులనే భావన పోయి, శత్రు భావన ఏర్పడడంతో ఆవేశాకావేశాలు కనిపిస్తున్నాయి.
అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ అంటే, తిట్ల పురాణమే. రాజకీయాలు కలుషితం అయ్యాయనేది చాలా చిన్నమాట. రాజకీయాలు ఎలా ఉండకూడదో ఏపీని చూస్తే అర్థమవుతుందనే వాళ్లు లేకపోలేదు. ఇందులో ఒకరెక్కువ, మరొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. దొందు దొందే. ఇట్లా వుంటేనే ఇప్పటి రాజకీయాల్లో మనుగడ సాగిస్తామని అన్ని పక్షాల నాయకులు అంటున్నారు.
మర్యాదస్తులకు రాజకీయాలు సరైన వేదిక కాదనే భావన బలపడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీలో ఘర్షణలు జరగొచ్చని కొన్ని రోజుల క్రితం కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించడం గమనార్హం. దీంతో కౌంటింగ్ మొదలుకుని రెండు వారాల పాటు కేంద్ర బలగాల్ని మోహరించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. శాంతిభద్రతల్ని నెలకొల్పడం కేవలం పోలీసుల బాధ్యత అనుకుంటే పొరపాటు.
ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవితం గడపాలని కోరుకోవాలి. అప్పుడే సమాజం ప్రశాంతంగా వుంటుంది. ఎన్నికల్లో గెలుపోటములు సర్వసాధారణం. గెలుపు, ఓటమి శాశ్వతం కాదని గుర్తించాలి. ఐదేళ్లు, లేదంటే పదేళ్లకో అధికార మార్పిడి మనం చూడడం లేదా? అని ప్రశ్నించుకోవాలి. 2014 నుంచి ఐదేళ్ల పాటు ఇదే కూటమి, అలాగే ఆ తర్వాత ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీల అభిమానులు ఎంత మంది ఎన్ని రకాలుగా లబ్ధి పొందారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్య నాయకులు ఆర్థికంగా, ఇతరత్రా భారీగా ప్రయోజనాలు పొందుతారే తప్ప, అభిమానులకు ఒరిగేదేమీ వుండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నాయకులు లేదా ఏదైనా పార్టీపై అభిమానం వుంటే… ఓటు రూపంలో చూపించారు. ఇంతటితో సరిపెట్టుకుంటే అందరికీ మంచిది. అంతకు మించి ఓవరాక్షన్ చేస్తే మాత్రం… చిక్కుల్లో పడేది తామే అని గ్రహించి, రెచ్చిపోకుండా వుండడం మంచిది. అనవసరంగా గొడవలకు పాల్పడి, జైలుపాలైతే కుటుంబం వీధిన పడుతుంది. అప్పుడు ఆదుకునే వారెవరూ ఉండరు. పైగా దీన్ని కూడా నాయకులు తమ స్వార్థానికి వాడుకుంటారు.
అందుకే ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా… ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. ఓటమిని స్పోర్టీగా తీసుకోవాలి. అలాగే గెలిచామని విరవీగొద్దు. అదే ఓటమికి పునాది వేస్తుందని గ్రహించాలి. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రతి ఒక్కరూ సంయమనం పాటించడం ఉత్తమం. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టకపోవడం మంచిది. భావితరాలు గుర్తించుకునేలా ప్రవర్తించడానికి మించిన విజయం లేదు.