కౌంటింగ్‌కు వేళైంది. రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. అధికార పార్టీ వైసీపీ పోస్టల్ బ్యాలెట్లపై ఆశలు వదులుకుంది. వాటిలో తమకు ఎంత తక్కువ వ్యతిరేకంగా ఓట్లు పడితే అంత మంచిదనే భావనలో వైసీపీ వుంది. అందుకే మొదటి అరగంట లేదా గంట పాటు కూటమి ముందంజలో వుంటుందని వైసీపీ స్పష్టమైన సంకేతాల్ని తమ శ్రేణులకి పంపింది.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాత మొదలయ్యే ఈవీఎం ఓట్లలో ఆధిపత్యం ప్రదర్శిస్తామని వైసీపీ ధీమాగా వుంది. అంటే ఉదయం 10 గంటల నుంచి తాము లీడ్ కనబరుస్తామని వైసీపీ నాయకులు ఆలోచన. మరోవైపు కూటమి మాత్రం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు నుంచే లీడ్ మొదలవుతుంది, అది కొనసాగుతుందని చెబుతోంది.
ఇలాంటి చర్చలు, రచ్చలకు ముగింపు పలకడానికి ఎంతో సమయం లేదు. కౌంటింగ్ హాళ్లకు ఏజెంట్లు చేరుకున్న నేపథ్యంలో, 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వుంటే, కాస్త సమయం ఎక్కువ తీసుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్లు లేని చోట, 8 గంటల నుంచే ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.