ఒకప్పుడు అల్లరి నరేష్ చేతినిండా సినిమాలే సినిమాలు. కానీ ట్రెండ్ మారింది. కామెడీ రైటర్లు తగ్గారు. రాస్తే జబర్దస్త్ కామెడీ రాస్తున్నారు. టీవీ లో పేలినట్లు థియేటర్ లో పేలడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కాస్త వెనక్కు తగ్గాడు అల్లరి నరేష్.
ఇలాంటి టైమ్ లో డిఫరెంట్ సినిమాలు పడడం, అవి హిట్ కావడం మొదలైంది. నాంది, ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు అల్లరి నరేష్ మార్కెట్ ను స్టడీ చేసాయి. బచ్చలమల్లి ఫస్ట్ లుక్ తోనే మొత్తం బిజినెస్ క్లోజ్ చేసుకుంది. దీంతో ఇప్పుడు నిర్మాతల దృష్టి మళ్లీ అల్లరి నరేష్ వైపు మళ్లింది.
సితార సంస్థ అల్లరి నరేష్ కోసం ప్రత్యేకంగా ఓ కథను తయారు చేయించి, త్వరలో సెట్ మీదకు తీసుకెళ్తోంది. డైరక్టర్ విక్రమ్ కుమార్ ఓ తమిళ దర్శకుడిని, మంచి స్క్రిప్ట్ ను అల్లరి నరేష్ కోసం తెచ్చారు. నిర్మాత చిట్టూరి శ్రీను ఓ ప్రాజెక్ట్ ను అల్లరి నరేష్ తో చేయబోతున్నారు. సుడిగాడు 2 ప్రాజెక్ట్ మళ్లీ తెరమీదకు వస్తోంది. ఇవన్నీ ఇలా వుంటే ‘జెండా’ అనే మంచి సబ్జెక్ట్ ను అల్లరి నరేష్ దగ్గర వుంచుకున్నారు. ఈ సబ్జెక్ట్ నచ్చి, తానే కొని దగ్గర పెట్టుకున్నారు.
ఆ సబ్జెక్ట్ కు తగిన దర్శకుడు దొరికితే, మంచి నిర్మాత చేతిలో ఆ ప్రాజెక్ట్ వుంటుంది. అంటే చేస్తున్న బచ్చలమల్లి కాకుండా నాలుగు ప్రాజెక్ట్ లు. ఈ లెక్కన మరొక్క హిట్ పడితే అల్లరి నరేష్ డైరీ మరో రెండేళ్లు ఫుల్ అయిపోతుంది.