కొత్త టాక్ వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. పవన్ ను కేంద్రానికి తీసుకెళ్లి, మంత్రిని చేస్తుంది భారతీయ జనతా పార్టీ అన్నది ఆ ముచ్చట. కూటమి అధికారంలోకి వచ్చినా, అసలు ఆంధ్రలోనే మంత్రి పదవి తీసుకునే ఆలోచనలో లేరు పవన్. కింగ్ మేకర్ గానే వుంటారు. మంత్రి పదవి తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకు. ఆయన మాటే శాసనం అన్నట్లు వుంటుంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కూటమికి అధికారం అంటూ వస్తే అది పవన్ పెట్టిన ప్రసాదమే కదా?
పవన్ కేంద్ర మంత్రి అన్నది కొత్తగా పుట్టిన వార్త కాదు. ఎన్నికల టైమ్ లో కూడా వినిపించింది. అయితే పవన్ పిఠాపురం నుంచి పోటీ కి దిగడంతో ఇక కేంద్ర మంత్రి అనే మాట వినిపించడం మానేసింది. కాబోయే హోమ్ మంత్రి అన్నది చక్కర్లు కొట్టడం మొదలైంది. కానీ ఇప్పుడు మళ్లీ కేంద్ర మంత్రి అనే మాట వినిపిస్తోంది
కానీ నిజంగా కేంద్ర మంత్రి కావాలి అంటే పవన్ ముందుగా లోక్ సభ లేదా రాజ్యసభ సభ్యుడు కావాలి. ముందుగా ప్రమాణ స్వీకారం చేసేసి, తరువాత ఆరు నెలల లోగా సభకు ఎంపిక కావచ్చు. కానీ అవన్నీ సమస్య కాదు. పిఠాపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అలా చేస్తే మాత్రం పవన్ నూటికి నూరుశాతం పిఠాపురం నియోజకవర్గ ప్రజల దృష్టిలో అపరాధిగా మిగిలిపోతారు. తమతో వుంటానని, తమకు అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తా అని, ఇంకా చాలా చాలా చేస్తానని చెబతే మాత్రమే కాదు, ‘తమ వాడు’ అని ఓన్ చేసుకుని పిఠాపురం జనాలు ఓట్లేసుకున్నారు.
ఇప్పుడు రిజైన్ చేసి, మళ్లీ వర్మకే అప్పగిస్తే, పవన్ తమను మోసం చేసినట్లు ఫీలువుతారు అక్కడి జనం. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కేంద్ర మంత్రిగా వెళ్ల కూడదు. ఈ అయిదేళ్లు మాత్రం పిఠాపురం జనాలతోనే వుండాలి. అలా కాకపోతే అది పవన్ కు మాత్రమే కాదు. జనసేన పార్టీకి కూడా దారుణమైన మైనస్ గా మారుతుంది. ఎవరి మాటలో విని, ఏదేదో అనుకుని పవన్ కేంద్రానికి వెళ్తే, అంతకన్నా తప్పిదం ఆయన రాజకీయ జీవితంలో మరోటి వుండదు.