బెంగళూరు రేవ్ పార్టీ… నటి హేమ అరెస్ట్

సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన సీసీబీ టీమ్ హేమను అదుపులోకి తీసుకుంది. Advertisement ఈ కేసుకు…

సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన సీసీబీ టీమ్ హేమను అదుపులోకి తీసుకుంది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు హేమకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే అనారోగ్య కారణాల్ని చూపుతూ ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో పోలీసులే హైదరాబాద్ వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. మీడియా కంటికి కనిపించకుండా బురఖా ధరించారు హేమ.

రేపు ఉదయం హేమను కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో కోర్టు కచ్చితంగా హేమను పోలీసుల రిమాండ్ కు అప్పగిస్తుంది.

గత నెల 20వ తేదీన బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొంది హేమ. ఈ పార్టీపై దాడి చేసిన సీసీబీ పోలీసులు కొంతమంది తెలుగు టీవీ నటీనటులు, మోడల్స్ తో పాటు హేమను అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆ టైమ్ లో తను రేవ్ పార్టీలో లేనని, తన ఫామ్ హౌజ్ లో ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు హేమ. దీనికి కౌంటర్ గా పోలీసులు ఆమె ఫొటోను విడుదల చేశారు. ఆ తర్వాత రోజు తను ఇంట్లోనే ఉన్నానంటూ ఓ వంటల వీడియోను రిలీజ్ చేశారు. ఆ వెంటనే డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో హేమ ఈ కేసులో ఇరుక్కున్నట్టయింది.

కేసు విచారణకు సంబంధించి 2సార్లు నోటీసులిచ్చినప్పటికీ హేమ రాకపోవడంతో, పోలీసులు హైదరాబాద్ వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 86 మంది మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్థారణ అవ్వగా, అందులో హేమ ఒకరు.