కొంచెం ఇష్టం… కొంచెం క‌ష్టం!

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. గ‌తంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ వివాదాస్ప‌దం, చ‌ర్చ‌నీయాంశం కాలేదు. మ‌రీ ముఖ్యంగా కూట‌మి నేత‌లు త‌మ‌కు అధికారం ద‌క్క‌ద‌నే మాటను కూడా స‌హించే…

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. గ‌తంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ వివాదాస్ప‌దం, చ‌ర్చ‌నీయాంశం కాలేదు. మ‌రీ ముఖ్యంగా కూట‌మి నేత‌లు త‌మ‌కు అధికారం ద‌క్క‌ద‌నే మాటను కూడా స‌హించే పరిస్థితి లేదు. నిజంగా ఎగ్జాట్ ఫ‌లితాలు కూట‌మికి అధికారాన్ని దూరం చేస్తే, ఒప్పుకుంటారా? లేదా? అనే అనుమానం వారి రాద్ధాంతం చేయ‌డం చేస్తే ఎవ‌రికైనా క‌లుగుతుంది.

అంతా త‌మ‌కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించాల‌ని కోరుకోవ‌డ‌మే విడ్డూరం. ఓ ప‌ది సంస్థ‌లు త‌మ‌కు అనుకూలంగా ఇచ్చినా కూట‌మి నేత‌ల‌కు సంతృప్తి క‌ల‌గ‌డం లేదు. ఒక‌రిద్ద‌రు నెగెటివ్ ఫ‌లితాలు వెల్ల‌డించ‌గానే, ఏదో అయిన‌ప‌ట్టుగా కూట‌మిలో భ‌యం క‌నిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ నేత‌లు హెచ్చ‌రించే ధోర‌ణిలో మీడియా స‌మావేశాల్లో మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇక వీరికి అధికారం ద‌క్కితే, ఎవ‌రూ మాట్లాడే ప‌రిస్థితి కూడా ఉండ‌దేమో అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

భిన్న‌మైన ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి కావ‌డంపై వైసీపీలో కూడా అస‌హ‌నం క‌నిపిస్తోంది. అయితే దాన్ని బ‌య‌టికి ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. వైసీపీపై ఇలాంటివి స‌ర్వ‌సాధార‌ణ‌మే అని ఆ పార్టీ నేత‌లు స‌రిపెట్టుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీ కీల‌క నాయ‌కుడు వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అస‌లు ఆ ఫ‌లితాల‌తో త‌మ‌కు సంబంధ‌మే లేద‌ని కొట్టి పారేశారు. 36 గంట‌లు ఆగితే ఎగ్జాట్ ఫ‌లితాలే వ‌స్తాయ‌న్నారు.

ఎన్నిక‌ల సంఘాన్ని అడ్డు పెట్టుకుని కూట‌మి నేత‌లు తుపాను సునామీల‌ను సృష్టిస్తున్నార‌ని దెప్పి పొడిచారు. త‌మ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలే మ‌రోసారి జ‌గ‌న్‌ను సీఎం చేస్తాయ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్ వింటే.. ఎగ్జిట్ పోల్స్‌పై అస‌హ‌నంగా ఉన్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. పూర్తిస్థాయిలో ఫ‌లితాలు అనుకూలంగా వుండి వుంటే, ఎగ్జాట్ ఫ‌లితాలు కూడా అట్లే వుంటాయ‌ని చెప్పి వుండేవారు. ఎగ్జిట్ పోల్స్‌పై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. త‌మ‌కు అనుకూల ఫ‌లితాల గురించి కొంద‌రు సానుకూల దృక్ప‌థంతో చెబుతున్నారు. మ‌రికొంద‌రు మాత్ర‌మే… వాటిని కొట్టి పారేస్తూ, నాల్గో తేదీన అంతా మంచే జరుగుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ నేత‌లైతే, పూర్తిగా అనుకూల‌తే వుండాల‌ని ఏకంగా వార్నింగ్‌లే ఇస్తున్నారు.